
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): దళితబంధు నిలిపివేతపై దళిత నేతలు, మేధావులు మండిపడుతున్నారు. ఇది రాజకీయ ఒత్తిడితో ఈసీ నిర్ణయం తీసుకున్నదని దుయ్యబడుతున్నారు. ఈ దళిత వ్యతిరేక నిర్ణయం వల్ల దళితులు నష్టపోతారని, దళిత అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నారు.
రాజకీయ ఒత్తిడితోనే నిర్ణయం
ఎన్నికల కమిషన్ నిర్ణయం రాజకీయ ఒత్తిడి మేరకే జరిగినట్టు అర్థమవుతున్నది. ఇది దళిత వ్యతిరేక నిర్ణయం. దళితుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాన్ని అడ్డుకోవడం సమంజసం కాదు. కులవాద, మనువాద భావజాలానికి ఈ నిర్ణయం పరాకాష్టగా నిలుస్తుంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకానికి నిధులు కేటాయించింది. హుజూరాబాద్‌కు మాత్రమే కాకుండా మొదటగా వాసాలమర్రి గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
– మల్లెపల్లి లక్ష్మయ్య, దళిత మేధావి
దళితులకు తీరని అన్యాయం
దళితజాతి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు కార్యక్రమాన్ని విపక్షాలు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దళితులకు తీరని అన్యాయం. సంక్షేమ కార్యక్రమాల అమలు నిరంతర ప్రక్రియ. అందులో భాగంగానే నా తుంగతుర్తి నియోజకవర్గంతోపాటు ఖమ్మం, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు కూడా ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసినందుకు దళితజాతి పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. దళితుల అభ్యున్నతికి ఉపయోగపడే ఇలాంటి పథకాన్ని అడ్డుకోవడం దురదృష్టకరం. హుజూరాబాద్‌లో ప్రజల మద్దతు లేదనే అక్కసుతో ఇలాంటి దౌర్భాగ్యపనులకు బీజేపీ, కాంగ్రెస్ పాల్పడుతున్నాయి. ప్రభుత్వానికి అన్నివర్గాల మద్దతు దక్కుతుందనే భయంతోనే ఇలాంటి కుట్రలకు విపక్షాలు తెరలేపుతున్నాయి. దళితుల అభివృద్ధిని అడ్డుకుంటున్న విపక్షాలు రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగవడం తథ్యం. – గాదరి కిశోర్, తుంగతుర్తి ఎమ్మెల్యే
బీజేపీ దళిత వ్యతిరేకి
బీజేపీ దళిత వ్యతిరేకి అని స్పష్టమవుతున్నది. ఇంత మోసం ఎక్కడా ఉండదు. దళితులకు పదిలక్షలు ఇచ్చే కార్యక్రమం విజయవంతమవుతుంటే ఓర్వలేక పోయారు. వాళ్లు బాగు పడితే కండ్లు మండాయి. మొదటి నుంచి ఎలాగైనా ఆపాలని చూశారు. అవి విఫలం కావడంతో ఈసీకి ఫిర్యాదు చేసి ఆగేలా చేశారు. ఈటల రాజేందర్‌కు దళితులే బుద్ధి చెబుతారు. ఆర్థిక ప్రయోజనం జరగకుండా, వారు బాగు పడకుండా ఈటల రాజేందర్ చేసిన పనిని అందరు గమనిస్తున్నారు. ఇది వారి మెడకే చుట్టుకుంటుంది. -క్రాంతి కిరణ్, అందోల్ ఎమ్మెల్యే
దళితజాతిపై కుట్రను తిప్పికొడతాం
అణగారిన దళితజాతి అంతరించిపోవాలనే బీజేపీ కుట్ర మరోసారి బయటపడింది. బీజేపీ ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి ఈ పథకాన్ని ఆపాలని పన్నిన కుట్రను తిప్పికొడతాం. దళితజాతి పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి పొందాలనే తపనతో సీఎం కేసీఆర్ దళితబంధును తెస్తే దళితజాతి బాగుపడితే తమకు బతుకులేదని బీజేపీ భావించింది. ప్రపంచంలో దళితుల బాగుకోసం ఏ ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించలేదు. ఆలోచిస్తున్నవారు ముందుకు సాగకూడదని బీజేపీ దుర్మార్గానికి ఒడిగట్టింది. దీనికి హుజూరాబాద్ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. దళిత సమాజం ఏకమై బీజేపీని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి.
ఈటల కుట్ర బయటపడింది
బీజేపీ నేత ఈటల రాజేందర్ కుట్ర బయటపడింది. దళితబంధును ఆపాలని ఈటల లేఖ రాసిన విషయం వాస్తమేనని తేలిపోయింది. ఇప్పుడు రాజేందర్ ఏం సమాధానం చెబుతాడు. బీజేపీ దళితుల పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నదనడానికి ఇదొక ఉదాహరణ. దళితులు బాగు పడితే టీఆర్ఎస్కు ఎల్లవేళలా అండగా ఉంటారనే ఉద్దేశంతో దళితబంధును శాశ్వతంగా ఆపేందుకు కుట్రలు చేస్తున్నది.
– బండ శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
బీజేపీ ని బొంద పెట్టాలి
ఎన్నికలతో సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితజనోద్ధరణ కోసం వాసాలమర్రిలో ప్రారంభించిన దళితబంధు పథకాన్ని ఆపాలని బీజేపీ కుట్రపూరితంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయటం దుర్మార్గం. దీంతో బీజేపీ దళిత వ్యతిరేకి అని మరోసారి తేలిపోయింది. ఎన్నికల కమిషన్ ఎన్నికలతో సంబంధం లేకుండా తెచ్చిన ఈ పథకాన్ని నిలిపేయాలని తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. దళిత వ్యతిరేక బీజేపీని హుజూరాబాద్‌లో బొందపెట్టాలి. యావత్ దళితసమాజం బీజేపీ కుట్రల్ని తిప్పికొట్టాలి.
-పిడమర్తి రవి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్