సుల్తాన్‌బజార్,డిసెంబర్ 13: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ పలు మాదిగ సంఘాల నాయకులు సోమవారం నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఆఫీసు ప్రధాన ద్వారం ముందు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు, రాష్ట్ర అధ్యక్షుడు ఎం మల్లేశ్ మాదిగ, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమన్న మాదిగ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి రాగానే వంద రోజులలో ఎస్సీ వర్గీకరణ చేపడుతామని బీజేపీ నేతలు స్పష్టమైన హామీనిచ్చారని కానీ ఎనిమిదేండ్లు గడిచినా ఆ మాట ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా వర్గీకరణకు సానుకూలత వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. ఈ పోరాటంలో ఇప్పటివరకు 28 మంది మాదిగలు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు మాదిగ సంఘాల నాయకులు సాంబయ్య, సాయిలు, యాకయ్య, నరసింహులు, లింగయ్య, పొన్నాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.