MP Laxman | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏమి జరుగుతుందో మీరే చూడండి అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని గుర్తుచేశారు. ఎన్నికల ఫలితాల తరువాత కర్ణాటక అవుతుందో, హిమాచల్ అవుతుందో చూద్దామని పేర్కొన్నారు. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని, మంత్రులు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు.
బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అమలు చేయలేని హామీలతో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని, అవి అమలు కాకపోవడంతో కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా ఉన్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ నేతలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయని, మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రుల వ్యవహారశైలి, హామీల అమలు, రాష్ట్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే ప్రభుత్వం పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నదని విమర్శించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూనే అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హామీలన్నీ నెరవేర్చాలంటే బడ్జెట్‌కు అదనంగా రూ.1.53 లక్షల కోట్లు అవసరమని చెప్పారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి.. ఇప్పుడు షరతులు విధిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను వాడుకున్నదని, ఇప్పుడు దేశం మొత్తం ఎన్నికలకు తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు.