రంగారెడ్డి, జూలై 9 (నమస్తే తెలంగాణ) : బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలను అవమానించేలా మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం రంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన్ను మార్గమధ్యలో పార్టీ కార్యకర్తలు కలిసి ఫొటోలు దిగారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయానికి రావాలని ఆహ్వానించారు. ‘పార్టీ కార్యాలయంలో కార్యకర్తలంతా మీకోసం ఎదురుచూస్తున్నారు. అక్కడికి రావాలి’ అని ఓ నాయకుడు కోరారు.
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ.. ‘కార్యాలయంలో కార్యకర్తలు ఉంటే ఉండనివ్వండి.. వారి వద్దకు నేను వెళ్లాలా?’ అని ఎదురు ప్రశ్న వేశారు. తనకు అత్యవసర పని ఉన్నది, వెళ్లిపోవాలని చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఉన్న శ్రీధర్‌రెడ్డిని ఇక్కడకు రమ్మనండి.. లేదంటే అక్కడే ఉండమని చెప్పండి అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారు. ‘శ్రీధర్‌రెడ్డి చెబితేనే వింటారా? నేను చెబితే వినరా?’ అని కొంత అసహనాన్ని ప్రదర్శించారు. ‘మీకు కార్యకర్తలు అవసరం లేదా?’ అని ఓ నాయకుడు ప్రశ్నించగా, కార్యకర్తలతో పనిలేదని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.