హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో ఆగస్టు సంక్షోభం ఉంటుందని, ఎవరిని గద్దె దించి, ఎవరిని కూర్చోబెడుతారో.. చూడాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ జోస్యం చెప్పారు. ఎవరి గద్దెను ఎవరు కూలుస్తారో వేచి చూడాలని పేర్కొన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పబ్లిసిటీ కావాలని, అందుకే విదేశీ పర్యటనలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకొంటున్నదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రతి ఒక్కరి పాస్‌పోర్ట్‌కూ తగిన క్లియరెన్స్ ఉండాల్సిందేనని చెప్పారు.
మంత్రి కొండా సురేఖ బీజేపీలోకి వస్తారన్న ప్రచారంపై ఆమె స్పందిస్తూ.. సురేఖ తమ పార్టీలోకి రావాలా వద్దా? అనే విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కమిటీలో రాష్ర్టానికి చోటు దక్కకపోవడంపై స్పందిస్తూ.. ఎవరినైనా ఒక బాధ్యత నుంచి తీసేస్తే.. దాని కంటే మంచి బాధ్యత వస్తుందేమోనని వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా లేరని, ఆయన మంత్రి కాగానే పార్టీ బాధ్యతలు ఉండవని వివరించారు. ఈసారి మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ టికెట్‌ను స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్ ఉన్నదని, పవన్‌కుమార్‌రెడ్డి కోసం తాను టికెట్ అడిగినట్టు డీకే అరుణ స్పష్టంచేశారు. బీజేపీ ఎంపీల మధ్య విభేదాలు లేవని అంతా సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు.