హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తదా?’ అనే సామెత మాదిరిగానే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రవర్తిస్తున్నారని తెలంగాణ సమాజం మండిపడుతున్నది. తెలంగాణ పుట్టుకను అవమానిస్తున్న బీజేపీ నేతల జాబితాలో ఆయన కూడా చేరిపోయారు. కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్య తలాతోకా లేకుండా తెలంగాణ పుట్టుకను అవమానిస్తే ‘అట్లా అనొద్దు’ అని అనాల్సింది పోయి, ‘తేజస్వీ సూర్య సరిగానే అన్నడు’ అని ధర్మపురి అర్వింద్ సమర్థించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై ఇటీవల పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య విషం చిమ్మిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆవిర్భావాన్ని దేశ విభజనతో పోల్చుతూ.. బ్రిటీష్‌వాళ్లు ఇండియా-పాకిస్థాన్‌ను విభజించిన దానికంటే చెత్తగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేశారని తన అక్కసును వెళ్లగక్కారు.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. ప్రధాని మోదీ నుంచి తేజస్వీ సూర్య దాకా తెలంగాణ ఏర్పాటును ద్వేషించిన వాళ్లపై ప్రజలు విరుచుకుపడ్డారు. ఇతర రాష్ర్టాలకు చెందినవారికి అక్కసు ఉన్నదంటే వారికి ఈ ప్రాంతంపై సరైన అవగాహన లేకపోయి ఉండొచ్చు. అసలు వాళ్లకు తెలంగాణ సోయి ఉండాలని కోరుకోవడమే అత్యాశే అవుతుంది. కానీ మన గడ్డపై పుట్టినోడు.. మందిపాట పాడుడేంది? అని అర్వింద్ తాజా వ్యాఖ్యలపై ప్రశ్నల వర్షం కురుస్తున్నది. తాజా రాజకీయ పరిణామాలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ రెండురోజుల క్రితం ఓ సోషల్ మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.
దేశవిభజనతో పోల్చడం సరైనదా?
ఆ ఇంటర్వ్యూ సందర్భంగా ఎంపీ అర్వింద్ చేసిన ఇతర రాజకీయ, రాజకీయేతర అంశాలను ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. మొదటి నుంచి అదే ఆయన సహజనైజం అని కొట్టిపారేస్తున్నారు. కానీ, రాష్ట్ర ఆవిర్భావం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నది. ‘మోదీ, తేజస్వీ సూర్య వ్యాఖ్యలను పక్కనపెట్టండి. హండ్రెడ్ పర్సెంట్ ‘నేనే చెప్తున్న’ మొత్తం పనికిమాలిన రాజకీయం జేసిన్రు’ అని వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర విభజనను భారత్-పాక్ విభజనతో తేజస్వీ సూర్య పోల్చడాన్ని సమర్థిస్తున్నారా? అని యాంకర్ అడగగా, ‘అది విభజనే, ఇది విభజనే దానికి, దీనికి పెద్ద తేడా ఏముంది? అప్పుడు పదుల వేల మంది మరణించారు. ఇక్కడ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు’ అని అర్వింద్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజనను దేశ విభజనతో పోల్చడం సరికాదు కదా! అని అభిప్రాయాన్ని యాంకర్ చెప్పబోతుండగానే ‘తప్పేం ఉన్నది?, అదో డివిజన్.. ఇదో డివిజన్’ అంటూ చులకనగా పేర్కొనడమే కాకుండా ‘ప్రజలందరూ సచ్చిపోయారు కదా! మోదీ అందుకే తల్లితో పోల్చిండు.. అంతమంది చావాల్సింది కాదని పోల్చిండు’ అని మోకాలికి బోడిగుండుకు మెలికపెట్టి తలాతోకాలేని సమర్థింపు ప్రయత్నాలు చేశారు. దీంతో తెలంగాణ సమాజం రగిలిపోతున్నది. తెలంగాణ విషయంలో కనీసం ఒక యాంకర్‌కు ఉన్న స్పృహ కూడా అర్వింద్‌కు లేకపోవడం దారుణమని అంటున్నారు. మనుషులు మతంగా విడిపోయి విద్వేషాలు పెంచుకొని, వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల కారణంగా, ఒకవర్గాన్ని ఒకవర్గం చంపుకోవడం వల్ల నాటి దేశవిభజన సమయంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రం నాన్చివేత, సాచివేత ధోరణి కారణంగా మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజల మనసు రగిలిపోయింది. ఆ నిరాశ-నిస్పృహల కొలిమిలోంచి జనించిందే ఆత్మబలిదానాల సంతకం. తెలంగాణకు తాము ప్రతినిధులమని చెప్పుకొని తిరిగేవాళ్లకు కనీసం ఈ సోయికూడా లేకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ధర్మపురి అర్వింద్ వంటివారి కోసమా తమ బిడ్డలు ప్రాణాలు వదిలింది.. అని అమరవీరుల తల్లిదండ్రులు కన్నీళ్లపర్యంతం అవుతున్నారు.