హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వేలం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అమ్మేస్తా రా? ప్రభుత్వం వద్ద అలాంటి ప్రణాళిక ఏమైనా ఉందా? అని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలో విద్యాశాఖ పద్దుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 7,800 స్కూళ్లు మూతపడ్డాయని, వీటిని ఏం చేయబోతున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్లలో నిరుడు 3.5 లక్షల మంది డ్రాప్ అవుట్ అయినట్టు తెలిపారు. 1,931 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్ ఉన్నదని వాపోయారు.
ఆస్తిపన్నుపై వడ్డీలో 90% రాయితీ ; యూఎల్బీఎస్లోనూ ఓటీఎస్
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నుపై వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఈ ఏడాది నుంచే ఓటీఎస్ పథకాన్ని అమలుచేస్తున్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ తరహాలో అర్బన్ లోకల్ బాడీస్ (యూఎల్బీఎస్)లోని పన్ను చెల్లింపుదారులు ఆస్తిపన్ను బకాయి మొత్తం ఒకేసారి చెల్లిస్తే వడ్డీలో 90% రాయితీని కల్పించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంటే ఈ నెల 31 వరకు ఆస్తిపన్ను బకాయిలపై 10% వడ్డీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.