Allu Arjun | సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు అల్లు అర్జున్ బాధ్యుడు కాదని ఆయన అన్నారు.
ప్రభుత్వ వైఫల్యం వల్లే థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందని రాజా సింగ్ అన్నారు. ఈ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ను నేరస్తుడిగా చూడటం సరికాదని సూచించారు. అల్లు అర్జున్ జాతీయ అవార్డు సాధించి తెలుగువారి ప్రతిష్ఠను పెంచారని గుర్తుచేశారు.
తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ను ఇవాళ మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సుమారు రెండు గంటల పాటు అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. బన్నీ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం చిక్కడపల్లి పీఎస్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీని తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. కాగా, అల్లు అర్జున్ అంశంలో చట్ట ప్రకారం ఫాలో అవుతున్నామని పోలీసులు తెలిపారు.