హుజూరాబాద్ టౌన్, జనవరి 18: ప్రజా సమస్యల పరిష్కారం, అధికారిక కార్యక్రమాలకు వేదికలుగా నిలువాల్సిన హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఈటల పార్టీ మీటింగ్‌లు పెడుతున్నారు. తరచూ ఇదేతీరుగా వ్యహరిస్తుండటంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బుధవారం హుజూరాబాద్‌లోని కేసీ క్యాంప్‌లోని హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ శక్తి కేంద్రాల ఇన్చార్జీలు, పార్టీ పోలింగ్ బూత్ కమిటీల సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడటం పలు విమర్శలకు దారితీస్తున్నది. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నిర్మించిన కార్యాలయంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడమేంటని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ దీనిపై స్పందించి శాసనసభ్యుడి కార్యాలయం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.