హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మునుగోడులో బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా వివేక్ వెంకటస్వామి ఘోరంగా విఫలం అయ్యారని ఆ పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. కొందరు నేతలైతే ఆయనను ఓ ఐరన్ లెగ్గా అభివర్ణిస్తున్నట్టు తెలిసింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలకు జితేందర్‌రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించారు. అక్కడ పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా జితేందర్‌రెడ్డి ఉండి.. ఐదు స్థానాల్లో విజయం సాధించేలా చేశారు. మునుగోడులో సైతం జితేందర్‌రెడ్డికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగిస్తారని, అక్కడా మంచి ఫలితం వస్తుందని నేతలు, శ్రేణులు ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా వివేక్ వెంకటస్వామిని నియమించడంతో ఒక్కసారిగా ఉసూరుమన్నారు. ప్రజల్లో పెద్దగా ఆదరణ లేని, రాజకీయ వ్యూహాలు ఏమాత్రం లేని వ్యక్తికి ఎలా అప్పగిస్తారని కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
మునుగోడులో సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగుతున్నారని, ఆయన ముందు వివేక్ వ్యూహాలు దూదిపింజలే అన్న వాదనలు సైతం వినిపించాయి. వివేక్ వ్యవహార శైలిపైనా అంతర్గతంగా విమర్శలు వచ్చినట్టు తెలిసింది. క్రమంగా రాష్ట్ర, కేంద్ర పెద్దలకు అసలు విషయం బోధపడటం మొదలైందని నేతలు చెప్తున్నారు. ప్రచారం, పోల్ మేనేజ్మెంట్, చేరికలు.. ఇలా అన్ని విషయాల్లోనూ వివేక్ ఘోరంగా విఫలం అయినట్టు పేర్కొంటున్నారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పేరు తెలియని నేతలే 90 శాతం మంది ఉన్నారు. ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ వంటి కాస్త పేరున్న నేతలను చివరన ఉంచారు. దీంతో వారు ప్రచారంలో ఆలస్యంగా పాల్గొన్నారు. ఇక వివేక్ నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీకే చెందిన దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. అప్పగించిన డజను మంది నేతలనే కాపాడుకోలేని వ్యక్తి.. దాదాపు 2.5 లక్షల మంది ఓటర్లను ఎలా మేనేజ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఓటమిలో ప్రధాన బాధ్యత వివేక్‌దే అని మండిపడుతున్నారు.