హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ): బీజేపీ నేతల విద్వేష వ్యాఖ్యలతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ బహ్రెయిన్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలలో దాదాపు 88 లక్షల ప్రవాస భారతీయులున్నారని, అందులో 15 లక్షల తెలంగాణీయులు ఉపాధి పొందుతున్నాని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన రెచ్చగొట్టే, విద్వేషపూరిత వ్యాఖ్యల ప్రభావం గల్ఫ్‌దేశాల్లో ఉన్న తమపై పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న దాదాపు 88 లక్షల ప్రవాసభారతీయులు స్వదేశం తిరిగి వస్తే కేంద్రం ఉపాధి చూపుతుందా? అని ప్రశ్నించారు. భార్యాపిల్లలను వదిలి నాలుగు రాళ్లు సంపాదించుకుందామని పరసీమలకు వెళ్లినవాళ్లు ఉపాధిని కోల్పోయి, జీవితాలు రోడ్డుమీద పడితే దానికి బాధ్యులు ఎవరని నిలదీశారు. బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొడితే ప్రస్తుతం గల్ఫ్ దేశాలతో ఉన్న స్నేహబంధం తెగిపోయే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. గల్ఫ్‌దేశాల్లో హిందూ దేవాలయాలను కట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయని, మూడేండ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ అబుదాబిలో హిందూ దేవాలయానికి పునాది రాయి వేశారని సతీశ్‌కుమార్ గుర్తుచేశారు. ఇటువంటి సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టకూడదని బండి సంజయ్‌కు హితవు చెప్పారు.