హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : నాడు బీఆర్ఎస్ వాదనతో సుప్రీం కోర్టు.. అది విశ్వవిద్యాలయం భూమి అని చెప్పిందని, దానిని ఎవరికీ ధారాదత్తం చేయొద్దని సూచించిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆ భూమిలో నెమళ్లు, జింకలు, పక్షులను, ఆయుర్వేద మొక్కలను చంపేసి నేడు రేవంత్‌రెడ్డి సర్కారు దానిని కాంక్రీట్ జంగల్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. హెచ్‌సీయూ భూముల ఆక్రమణను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్, నగేశ్‌తో మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేం ద్ర ప్రధాన్‌కు వినతిపత్రం అందజేశారు.
యూనివర్సిటీలో పర్యావరణ ప్రాముఖ్యతను అధ్యయనం చేసేందుకు రివ్యూ కమిటీ వేయాలని రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. మరోవైపు భూముల అంశాన్ని రాష్ట్ర బీజేపీ ఎం పీలు పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తారు. దీనిని తీవ్రంగా ఖండిస్తూ రాజ్యసభలో ఎంపీ కే లక్ష్మణ్ ఆందోళన చేపట్టారు. ఉగాది పండుగ పూట విదార్థుల నెత్తురు కండ్ల చూడటం ప్రజాపాలనా? అని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హెచ్‌సీయూలో నిరసనకు వెళ్తారన్న సమాచారంతో ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.