జగిత్యాల, ఆగస్టు 29, (నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా కమలదళంలో మళ్లీ కలకలం మొదలైంది. నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఏకంగా బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకే ఆయన ప్రత్యర్థి వర్గం నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం ఒక కీలక నేతకు చెందిన ఫామ్‌హౌస్‌లో సమావేశమై కార్యాచరణ రూపొందించుకున్నట్టు తెలుస్తున్నది. అరవింద్ వ్యతిరేక వర్గానికి చెందిన కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలిసింది.
ఆ రెండు నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నాయకులు, నియోజకవర్గ మాజీ ఇన్చార్జులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ అంతర్గత కార్యక్రమాల్లో వైరిపక్షాలుగా ఉన్న ఇరువర్గాలను ఏకంచేసి, అర్వింద్‌కు చెక్ పెట్టేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కీలక నాయకుడు, పెద్ద ప్రజాప్రతినిధి రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతున్నది. ఎంపీ అరవింద్ తన పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో బీజేపీ పూర్వ కార్యకర్తలు, నాయకులను కాదని, తనకంటూ కొత్త వర్గాన్ని ఏర్పాటు చేసుకొంటున్నారని, ఆ రెండు నియోజకవర్గాల్లో తనకు అనుకూలమైన వ్యక్తులకే ప్రాధాన్యమిస్తూ, ఇతర నాయకులు, కార్యకర్తలను విస్మరిస్తున్నారన్న ఆరోపణలు కొన్నేండ్లుగా వినిపిస్తూ వస్తున్నాయి.
రెండు నియోజకవర్గాల్లో అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులు, కార్యకర్తలు శనివారం రాయికల్-మల్లాపూర్ మండలాల మధ్య ఉన్న ఒక నాయకుడికి చెందిన ఫామ్‌హౌస్‌లో సమావేశమయ్యారు. మొదటి నుంచి బీజేపీలోనే కొనసాగుతూ, ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక నాయకుడు ఎంపీ అరవింద్‌కు వ్యతిరేకంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సదరు పెద్ద నాయకుడు జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన అసంతృప్త నాయకులు, సీనియర్ కార్యకర్తలందరినీ సమన్వయం చేసినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే నాయకులందరూ కోరుట్లకు చెందిన బీజేపీ నాయకుడి ఫామ్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఇందులో రెండు నియోజకవర్గాల్లో ఎంపీ అరవింద్ వర్గం తమను పూర్తిగా విస్మరించిందని ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
అధిష్ఠానం దృష్టికి పంచాయితీ
జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల బీజేపీ అంతర్గత పంచాయితీని బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని ఫామ్‌హౌస్‌లో సమావేశమైన నాయకులు నిర్ణయించుకొన్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే త్వరలోనే జగిత్యాల, కోరుట్లలోని అసంతృప్తనేతలు సదరు పెద్ద నాయకుడి నేతృత్వంలో హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో సమావేశం అయ్యేందుకు ఏర్పాట్లు ప్రారంభమైనట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అర్వింద్‌ను వ్యతిరేకించే నాయకులు, కార్యకర్తలపై సోషల్ మీడియాలో ఆయన వర్గం కౌంటర్ అటాక్ మొదలు పెట్టినట్టు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి.