కరీంనగర్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఈటల నామినేషన్ సందర్భంగా శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్టణంలో పర్యటించిన కొద్దిసేపటికే బీజేపీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు నందగిరి మహేందర్‌రెడ్డి సహచరులు వంద మందితో రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఈటల రాజేందర్ ఒంటెద్దు పోకడతో తనను పట్టణ అధ్యక్ష పదవి నుంచి తొలిగించారని, వారు పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని మహేందర్‌రెడ్డి ఆరోపించారు.
సొంత పార్టీ నాయకులను గుర్తించని ఈటల..
నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన ఈటల రాజేందర్ ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్న నాయకులను పట్టించుకోవడం లేదని, నమస్తే పెడితే మొఖం తిప్పుకొని పోతున్నాడని మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నాయకులంతా ఈటలపై వ్యతిరేకతతో ఉన్నారని, ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారని మహేందర్ చెప్పడం ఆ పార్టీలోని గందరగోళ పరిస్థితి తెలియజేస్తున్నది. ఓ వైపు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేసి ఉధృతంగా ప్రచారం చేస్తుండగా, ఇంకా ఈటల ఇంటిని చకదిద్దుకునే పనిలోనే ఉండటం బీజేపీ ఇంచార్జీలకు తలనొప్పిలా మారింది.
బీజేపీ శ్రేణుల్లో కన్పించని జోష్..
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు బండి సంజయ్, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు వచ్చి నా ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ కన్పించడం లేదు. ఈటల వర్గం ఒంటెద్దు పోకడను మొదటి నుంచీ ఉన్న బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నా రు. తాము 30 ఏండ్ల నుంచి బీజేపీలో ఉన్నామని, అధికారంలో లేకున్నా కష్టపడి పనిచేశామని, కానీ తన ఆస్తుల రక్షణ కోసం బీజేపీలో చేరిన ఈటల.. తమను అనామకుల్లా చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈటల తీరు ఇలాగే కొనసాగితే, డిపాజిట్ కూడా దకదని పార్టీలో మొదటి నుంచీ పనిచేస్తున్న కాషాయ వర్గాలు వాపోతున్నాయి.