ఆ పువ్వు పూజకు పనికి రాదు. ఆ పార్టీ తెలంగాణకు ఉపయోగపడదు. పుట్టుకనుంచి ఇప్పటిదాకా తెలంగాణకు వీసమెత్తు మేలు చేసింది లేదు. ఏనాడూ తెలంగాణ హక్కుల కోసం నిలబడ్డదీ లేదు. పోరాడింది అంతకన్నా లేదు. నాటి తెలంగాణ అంశంలోనూ ఢిల్లీ నాయకత్వమే సహకరించింది తప్ప రాష్ట్ర నేతలెవరూ నిలబడలేదు. స్వరాష్ట్రంలో నలుగురు ఎంపీలు గెలిచినా.. ఎనిమిదిమంది ఎన్నికైనా ఎన్నడూ ఏకాణా తెచ్చిన ముఖాలు కావు.
రాష్ట్రం వచ్చీ రాగానే ఏడు మండలాలను తమ పార్టీయే ఏపీకి ధారాదత్తం చేస్తే నోరెత్తినోళ్లు లేరు. కరెంటు కటకటతో రాష్ట్రం అరిగోస పడుతుంటే ఉన్న సీలేరునూ పక్క రాష్ర్టానికి ఇచ్చినా ఇదేం అన్యాయమని అన్నోడు లేడు. దొడ్డుబియ్యం వివాదంలోగానీ.. బయ్యా రం ఉక్కు ఎగవేతలోగానీ.. నవోదయ స్కూళ్ల గల్లంతులోగానీ.. మెడికల్ కాలేజీల వ్యవహారంలోగానీ కనీసం అడిగిన దాఖలాలూ లేవు. ఐటీఐఆర్ గుజరాత్‌కు పట్టుకుపోతే నోటికి తాళాలు వేసుకున్న దౌర్భాగ్యం! మన గోదావరి నీళ్లను ఓట్లకోసం తమిళనాడుకు తరలిస్తున్నా కండ్లుమూసుకున్న బానిసత్వం!
కేంద్రం సంగతి అలా ఉంచితే రాష్ట్రంలోనైనా ప్రజలకోసం ప్రభుత్వాన్ని నిలదీసినోడున్నడా అంటే అదీ లేదు. ఆరు గ్యారెంటీలు అటకెక్కినా, అడ్డగోలు కమీషన్ల వసూళ్లు సాగుతున్నా నోరెత్తినవాడు లేడు. అర్ధరాత్రి అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో వేధిస్తున్నా.. పెదవులు విప్పరు. రైతులకు సాగునీరివ్వకపోయినా సప్పుడు చెయ్యరు. అధికార పార్టీతో అంటకాగుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తరు.
ఇవాళ బనకచర్ల పేరుతో తెలంగాణకు చారిత్రక ద్రోహం జరుగుతున్నా ఒక్కరూ కిమ్మనరు. పైగా నిస్సిగ్గుగా పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని ఆదేశాలిస్తరు. వీళ్లకు తమ ప్రాంతం అనే సోయి లేదు. రాష్ర్టాన్ని, రైతులను కాపాడుకోవాలన్న తపన లేదు. ఉన్న ఒక్క గోదావరి తరలిపోతే రేపు తెలంగాణ గతి ఏమిటన్న ఆలోచన లేదు. ఎంతసేపూ ఢిల్లీ పాదుషాల ముందు జీ హుజూర్‌లు.. రాష్ట్ర సర్కార్‌కు మ్యాచ్ ఫిక్సింగ్ జో హుకుమ్లు.
వెరసి తెలంగాణ పాలిట కాంగ్రెస్ ఓ రాహువు!
బీజేపీ ఓ కేతువు!! రాష్ర్టానికి ఈ గ్రహపీడ.. గ్రహణపీడ!!
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 18 (నమస్తే తెలంగాణ) : గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు. 35 శాతం మంది ఓటర్లు ఆ పార్టీకి మద్దతు పలికారు. వీళ్లేదో కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశపడ్డారు. కానీ ఏం లాభం. ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించకపోగా, ప్రజలకు నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారు. బనకచర్ల వ్యవహారమే ఇందుకు తాజా ఉదాహరణ. బనకచర్ల విషయంలో చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ, తెలంగాణ పట్ల వివక్ష చూపుతుంటే ఎనిమిది మంది ఎంపీల్లో ఒక్కరైనా నోరు మెదపడం లేదు.
మా ఓటర్లకు, తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని కేంద్రాన్ని నిలదీసిన పాపాన పోవడం లేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సంగతి తెలిసిందే. 2019లో జరిగిన ఎన్నికల్లో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. 2014 నుంచి 2024 దాకా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన ఒక్క డిమాండ్‌ను కూడా పరిష్కరించలేదు. పైగా ప్రధాని మోదీ అనేకసార్లు ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ తెలంగాణ పుట్టుకనే తప్పుబట్టారు. అయినా సరే ఆ నలుగురు బీజేపీ ఎంపీల్లో ఒక్కరు కూడా నోరు తెరవలేదు. ఇది మొన్నటి కథ. నాడు విభజన చట్టాన్ని అమలు చేయని మోదీ ప్రభుత్వం, నేడు ఏకంగా ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నది. విభజన చట్టం పరిధిలోకి రాకుండా బనకచర్లపై రాజ్యాంగబద్ధత లేని ఒక సమావేశాన్ని పెట్టి, కమిటీని వేసి, ఏపీకి అనుకూలంగా ప్రాజెక్టును మందుకు తీసుకుపోవడానికి పావులు కదుపుతున్నది. అప్పుడు నలుగురు ఎంపీలు ఉంటే, ఇప్పుడు ఎనిమిది మంది ఉన్నారు. అయినా ఏం లాభం. విషయం సేమ్ టు సేమ్. ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. ఇది నేటి కథ.
బనకచర్లపై అడ్డగోలు సూత్రీకరణలు తీసుకొచ్చి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు చంద్రబాబును, ప్రతిపక్షమైన రేవంత్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ నేతలు సమర్థిస్తున్నారు. బనకచర్ల అంశం తెరపైకొచ్చినపుడు ‘ఏపీ ఇంకా డీపీఆర్ సమర్పించలేదు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయదు’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత చకచకా చోటుచేసుకున్న పరిణామాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వమే మధ్యవర్తిత్వం వహించి ఇద్దరు సీఎంలతో సమావేశం నిర్వహించింది. కమిటీ వేసి నెల రోజుల్లో నివేదిక తెప్పించుకుంటానంటున్నది. ఈ కమిటీని స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రకటిస్తే, తమకు తెలంగాణతోపాటు ఏపీ ప్రయోజనాలు కూడా ముఖ్యమే అని మరో ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. రాష్ట్ర బీజేపీ అంతటితో ఆగలేదు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఎవరైనా పొరబాటున తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతారేమోనని భయంతో.. పార్టీ ఏకంగా ఒక సర్క్యులర్ జారీ చేసింది. పార్టీ లైన్‌కు భిన్నంగా ఏమీ మాట్లాడొద్దని శ్రేణులను ఆదేశించింది. ఈ వైఖరి చూసి తెలంగాణ ప్రజలు సాగునీటి రంగ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు బీజేపీకి ఓటేసినం? ఎందుకు వీళ్లను గెలిపించినం? నమ్మినందుకు తగిన శాస్తి జరిగిందని తలలు పట్టుకున్నారు. తెలంగాణ బీజేపీ బనకచర్లకు అనుకూలమా? వ్యతిరేకమా? అనేది ప్రజల్లోనే కాదు, ఆ పార్టీలోనూ మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఉమ్మడి రాష్ట్రంలో అనేక సందర్భాల్లో తెలంగాణ బీజేపీ నదీజలాల అంశాలను ఎజెండాగా తీసుకొని అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇచ్చంపల్లి పాదయాత్ర చేసిన చరిత్ర కూడా ఉన్నది. పలు ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు కూడా చేపట్టింది. కానీ గత 11 ఏండ్లలో తెలంగాణ సాగునీటి రంగంపై మేధో మథనంగానీ, ఒక అంశాన్ని తీసుకొని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సాధించుకురావడంగానీ చేయలేదు. ఒకవైపు తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర సర్కారు కావేరీకి గోదావరి జలాలను తరలించేందుకు సిద్ధమవుతుంది. కర్ణాటకలో ప్రతిపక్షంలో ఉన్నాసరే బీజేపీ ఎంపీలు, నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమ రాష్ర్టానికి కొత్త ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులు తెప్పించడం కాదు కదా.. కనీసం అన్యాయాన్ని నిలువరించడంలోనూ ఒక్కరూ గొంతు పెగల్చడం లేదు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను మోదీ వ్యతిరేకిస్తుంటారు. ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంటారు. కానీ కారణం ఏందో తెలియదుగానీ తెలంగాణ బీజేపీ ఎంపీలు, నేతలు మాత్రం కాంగ్రెస్‌తో అంటకాగుతుంటారు. అనేక విషయాల్లో బహిరంగంగానే కాంగ్రెస్‌కు మద్ధతు పలుకుతుంటారు. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్రలో ఉన్నది. కాబట్టి ప్రజల తరఫున పోరాడాలి. జాతీయ పార్టీగా సాటి ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ప్రజలకు మేలు కలిగేలా, ప్రాంత ప్రయోజనాలు కాపాడేలా చూడాలి. కానీ రాష్ట్రంలో బీజేపీ నేతలు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మిత్రపక్ష నేతలుగా వ్యవహరిస్తున్నారు. వారు ఎంతసేపూ బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను విమర్శిస్తారే తప్ప కాంగ్రెస్‌ను పల్లెత్తుమాట అనడానికి సాహసించరు. రేవంత్ రెడ్డి మీద ఎందుకు ఇంత ప్రేమో ఎవరికీ అర్థం కావడం లేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలపై కూడా ధర్నాలు, రాస్తారోకోలు అంటూ ముందుకు ఉరికిన బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పుడు బనకచర్ల విషయంలో ఇంత జరుగుతున్నా ఒక్క ముక్క మాట్లాడటానికి కూడా మొహమాటపడుతున్నారు. బనకచర్ల విషయంలో ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీల సమావేశం నిర్వహించారు. అయినా సరే తమను ఎందుకు పిలవలేదని బీజేపీ ఎంపీలు అడగడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ఢిల్లీకి వెళ్లి బనకచర్లపై సంతకం పెట్టి వచ్చారు. 8 మంది బీజేపీ ఎంపీల్లో కనీసం ఒక్కరైనా ‘మమ్మల్ని సంప్రదించకుండా సంతకం ఎలా చేస్తారు?. ఇది కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారం కాదు కదా? తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారం కదా?’ అని ప్రశ్నించే ధైర్యం చేయడం లేదు.
జలవివాదాలకు సంబంధించి తెలంగాణ చేసిన విజ్ఞప్తులను, లేఖలను కేంద్ర ప్రభుత్వం దాదాపు 11 ఏండ్లు పెండింగ్‌లో పెట్టింది. కానీ చంద్రబాబు గతేడాది డిసెంబర్లో అడడగానే బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకపోయినా పచ్చజెండా ఊపింది. ఆరు నెలలు తిరగకముందే ఢిల్లీ వేదికగా సీఎంలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వెంటనే నిపుణుల కమిటీ వేసింది. మూడు రోజులు తిరగకముందే కమిటీలో ఎవరెవరు ఉండాలో ఖరారు చేసింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వబోతున్నది. ఇస్రో రాకెట్ కూడా ఇంత స్పీడ్‌గా కదలదేమో అన్నట్టుగా బనకచర్ల విషయంలో కేంద్రం వేగంగా నిర్ణయాలు తీసుకున్నది. ఇంత జరుగుతున్నా తెలంగాణ ఎంపీలకు ఇవేమీ కనిపించడం లేదు. ఎన్డీఏలో తెలుగుదేశం ఒక చిన్న పార్టీ. బీజేపీ పెద్ద పార్టీ, లీడింగ్ పార్టీ. ఎన్డీఏ కూటమిలోని ఒక చిన్న పార్టీకి సంబంధించిన నాయకుడు చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ, గోదావరిని తరలించుకుపోవడానికి ఎత్తు వేస్తుంటే, అదే కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు? అని ఒక సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నించారు.
ప్రజల ప్రయోజనాల కన్నా వారికి కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలే ముఖ్యం అయ్యాయి. బీజేపీకే చెందిన సాగునీటి రంగ నిపుణుడు వెదిరె శ్రీరాం బనకచర్ల ప్రాజెక్టు సరికాదని విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. చంద్రబాబు చెప్తున్నంతగా అందులో నీళ్లు లేవని, అసలు వరద జలాలు, మిగులు జలాలు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని, ఈ ప్రతిపాదనను తక్షణం మానుకోవాలని స్పష్టం చేశారు. బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆధారాలతో సహా చెప్తున్నా, కనీసం ఒక్క బీజేపీ ఎంపీ కూడా మద్దతు ఇవ్వడం లేదు. వెదిరె శ్రీరాం తమ పార్టీలైన్‌కు విరుద్ధంగా మాట్లాడుతారనే తెలిసే, పార్టీ ఆఫీస్‌లో మీడియా సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు అనుమతించలేదట. పైగా ఆయనలా ఎవరూ పార్టీలైన్ దాటొద్దని కట్టడి చేస్తున్నారు. కాళేశ్వరంలో ఒక పిల్లర్ కూలితే దానిపై సీఎం రేవంత్ రెడ్డి ‘కూలేశ్వరం’అని ముద్రవేసి, మరమ్మతు చేయకుండా పెండింగ్ పెడుతున్నా, ఆయనకు వంత పాడుతున్న బీజేపీ ఎంపీలు, నేతలకు ఇది గుర్తుకు రావడం లేదు. వీరికి కాంగ్రెస్ మీద మోజు ఎందుకు ఉన్నది? తెలంగాణ ప్రయోజనాల కన్నా ఆంధ్రా బనకచర్ల మీద ఎందుకు మక్కువ చూపుతున్నారు? అనే చర్చ జరుగుతున్నది. బనకచర్లపై తెలంగాణ బీజేపీ పాలసీ ఏమిటి? ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఎంపీలు సమాధానం చెప్పాల్సి ఉన్నది.
నదీ పరీవాహక ప్రాంతాల్లోని అన్ని రాష్ర్టాలతో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం అది. కానీ మోదీ ప్రభుత్వం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి దీనిని తెలంగాణ, ఆంధ్రా మధ్య వివాదం అన్నట్టుగా మార్చింది. చట్ట విరుద్ధంగా నదుల అనుసంధానానికి ప్రయత్నిస్తున్నది. అయినా ఒక్క బీజేపీ ఎంపీ కూడా ‘అలా ఎలా చేస్తారు? ఇది జాతీయ స్థాయి అంశం కదా?’ అని నోరువిప్పే సాహసం చేయ డం లేదు. ఒకవేళ ఇదే కర్ణాటకలో జరిగితే అక్కడి బీజేపీ నేతలు ఊరుకుంటారా? అక్కడి ప్రజలు సహిస్తారా? తెలంగాణ ప్రయోజనాలను నెరవేర్చకుండా, పరిరక్షించకుండా నదుల అనుసంధానం చేపట్టవద్దని, ఒకవేళ కేంద్రం చేపడితే మేం పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించే దమ్ము ధైర్యం ఒక్కరికీ లేకుండా పోయింది.
దేశ రాజకీయాలకు భిన్నంగా తెలంగాణలో మాత్రం ప్రతిపక్షంలోని బీజేపీ అధికార పార్టీకి రక్షణగా నిలుస్తుండటం రాజకీయ పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. కొన్ని సందర్భాల్లో బీజేపీ ఎంపీలు ఏకంగా కాంగ్రెస్ మౌత్‌పీస్‌లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. నగరంలో హైడ్రా కూల్చివేతలతో సామాన్యులు విలవిలలాడుతుంటే.. ఒక ఎంపీ ఈటల రాజేందర్ విమర్శిస్తే, మరో ఎంపీ రఘునందన్‌రావు హైడ్రాను కీర్తించారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ప్రజా సమస్యలను ఎత్తి చూపాల్సిన సమయంలో అధికార కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్ను లక్ష్యంగా విమర్శలు చేస్తుండటం నిత్యకృత్యంగా మారింది. నిరుడు అనేక ప్రాంతాల్లో రైతులు సాగునీరు లేక రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ఒక్క బీజేపీ ఎంపీ కూడా మద్ధతు పలికి, ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే బీజేపీ మరిచిందని అంటున్నారు.
గోదావరి నీళ్లను అప్పనంగా ఎత్తుకుపోయేందుకు బనకచర్లను చంద్రబాబు ప్రతిపాదించినా బీజేపీ ఎంపీల్లో ఉలుకూపలుకూ లేదు. గెలిపించిన తెలంగాణ ప్రయోజనాల కన్నా ఆంధ్రా బనకచర్ల మీద మక్కువ చూపుతున్నారు? ఇంతకీ బనకచర్ల మీద తెలంగాణ బీజేపీ పాలసీ ఏమిటి? జలదోపిడీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారా? కేంద్రంలో తమ ప్రభుత్వానికి మద్దతిస్తున్నందుకు తెలంగాణ జరగబోయే అన్యాయయాన్ని సమర్థిస్తున్నారా? ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పితీరాలి.