K Laxman : సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. రిజ్వీ ఎందుకు వీఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు.
‘మంత్రులు ఒత్తిడికి లొంగకపోతే వాళ్లని బలి చేస్తారా..?’ అని ఆయన దుయ్యబట్టారు. ‘మీ స్వార్థం కోసం అధికారులని వేధిస్తారా..?’ అని లక్ష్మణ్ ఘాటుగా విమర్శించారు. ఇంకా విచారణ పేరుతో సీనియర్ ఐఏఎస్ అధికారిని వేధించడం తగదని ఆయన హితవు పలికారు. ఒకవేళ తప్పుచేసి ఉంటే ఇన్నిరోజులు ఎందుకు మాట్లాడలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను ఆయన నిలదీశారు.