హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యం తో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు గుప్పించిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని ప్రచారం చేస్తూనే, అలవికాని హామీలు ఇచ్చారని విమర్శించారు.
మాట మార్చడం సీఎం రేవంత్‌రెడ్డికి కొత్తేమీ కాదని ఎద్దేవా చేశారు. ఆయన ఇటీవల ప్రధాని మోదీ తమ పెద్దన్న అని చెప్పారని, ఇప్పుడు మాట మార్చి మోదీకి ఎందుకు ఓటెయ్యాలె అని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో చాలాకాలం తర్వాత ప్రజలు నీళ్ల కోసం పరితపించే పరిస్థితి వచ్చిందని, ఇందుకు ఎవరు కారణమని నిలదీశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లో చేరితే.. నాడు అడ్డుగోలుగా మాట్లిడిన రేవంత్‌రెడ్డి..ఇప్పుడు కేశవరావును, కడియం శ్రీహరిని ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. గతంలో కడియం శ్రీహరి దళితుడే కాదని విమర్శించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆయన కూతురుకు టికెట్ ఎలా ఇచ్చారని నిలదీశారు.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు. పార్టీ మారినవారు పదవికి రాజీనామా చేయకపోతే అనర్హత వేటు పడేలా చట్టం చేస్తామంటున్న రాహుల్‌గాంధీ.. ముందు తెలంగాణలో అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల వారిని కొంటున్నారని, బిల్లులు మంజూరు చేయాలంటే తమ పార్టీలో చేరాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.