DK Aruna | సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత డీకే అరుణ సవాలు విసిరారు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు.. నా బాగోతం చెబుతానంటావా? నీ చరిత్ర ఏంటో ప్రజల ముందు బయటపెడతా అని మండిపడ్డారు. దమ్ముంటే పాలమూరులోని తెలంగాణ చౌరస్తాకు రా అని సవాలు విసిరారు.
నా నీతి, జాతి, డీకే సత్యారెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఒక మహిళ అని చూడకుండా నోటికొచ్చినట్లు దొరసాని.. తొక్కుతా.. అంటూ చేసిన అహంకార మాటలు మానుకోవాలని హెచ్చరించారు. నీ తల్లి, చెల్లి, నీ కూతుర్ని అడుగు మహిళ అంటే ఏమిటో చెబుతారని అన్నారు. ఈ ప్రాంత బిడ్డగా ప్రజల మన్ననలు పొందుతుంటే చూసి ఓర్వలేక నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక సీఎం రేవంత్రెడ్డి పాలమూరు జిల్లాలోనే ఐదుసార్లు పర్యటించారని తెలిపారు. ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తావా..? అని ప్రశ్నించారు.