జయశంకర్ భూపాలపల్లి/పెద్దపల్లి, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును తన ద్వారా హత్య చేయించేందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గతంలో కుట్ర చేశారని బీజేపీ నేత చల్లా నారాయణరెడ్డి ఆరోపించడం సంచలనం సృష్టించింది. ‘మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధును హత్య చేయాలని దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అతని తమ్ముడు శ్రీనుబాబు నాతోనే ప్లాన్ చేయించారు. పుట్ట మధును చంపడం నీవళ్లే అవుద్దని చెప్పారు. వాళ్ల మాటలు విని రంగంలోకి దిగాను. మార్గమధ్యలో నా మనసు మారింది. వెనక్కి వచ్చాం. నా రాజకీయ జీవితానికి ముగింపు పలికే ప్లాన్ చేశారని అర్థమైంది’ అంటూ బీజేపీ నేత చల్లా నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అనుచరుడిగా, మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కీలకనేతగా వ్యవహరించిన నారాయణరెడ్డి అనంతర కాలంలో బీఆర్ఎస్లో చేరారు. మంథని టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీలోకి, అనంతరం బీజేపీలోకి వెళ్లారు. తాజాగా శ్రీధర్‌బాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ‘మీతో 14 ఏండ్లు కలిసున్నప్పుడు, మీరు ప్రభుత్వ విప్‌గా ఉన్నప్పుడు.. పుట్ట మధు నిన్ను ఇబ్బంది పెడితే.. మీ మెప్పు కోసం నేను, కొంతమందిమి కలిసి పుట్ట మధును కొట్టాం. అప్పుడు నాతో మీరు మంచిగా మాట్లాడారు. పక్కన కూర్చోబెట్టుకుని టీ తాగించారు’ అని నారాయణరెడ్డి పేర్కొన్నారు. ‘నీకు పుట్టమధు కంట్లో నలుసులా మారినప్పుడు మనిద్దరం కారులో వెళ్తుండగా, మంథని గుట్టలు ఎక్కేటప్పుడు మధును ఏదో ఒకటి చెయ్.. ఏమైనా నేను చూసుకుంటా అన్నావ్.. శ్రీను బాబు సైతం నువ్వే హీరోవు.. వాన్ని ఏదో ఒకటి చేసే సత్తా నీకే ఉంది అన్నాడు.. అనంతరం పుట్ట మధు కనుకునూరుకు వెళున్నట్టు సమాచారం ఇచ్చాడు..
అప్పుడు నేను స్కూల్ వ్యాన్‌లో 40 మందిని తీసుకుని, 20 మోటర్ సైకిళ్లు, నాలుగు కార్లలో వెళ్తుండగా పోతువాయి సమీపంలో స్పీడ్ బ్రేకర్ దగ్గర కార్లు ఢీ కొన్నాయి.. అప్పుడు ఎందుకో నాకు జ్ఞానోదయం అయింది.. కావాలని నన్ను కేసులో ఇరికించే ప్లాన్ చేస్తున్నారు.. నా రాజకీయ జీవితం నాశనం చేసే ప్లాన్ చేస్తున్నారని తెలుసుకుని వెనుదిరిగాను’ అని నారాయణరెడ్డి వివరించారు. ‘ప్రశ్నిస్తే ఒక వ్యక్తిని నరికి చంపిస్తడు.. ఒక వ్యక్తినేమో లాగి చంపిస్తడు.. శ్రీధర్‌బాబు ఇకనైనా ఈ కల్చర్ ఆపు.. ఆపకుంటే నేనూ నేషనల్ పార్టీలో ఉన్నా.. మాకూ కార్యకర్తలు ఉన్నారు.. ఎవరిని విమర్శించినా ఊరుకోం’ అని హెచ్చరించారు. శ్రీధర్‌బాబుపై నారాయణరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వీడియోపై చల్లా నారాయణరెడ్డిని ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా, ఆ వీడియో పూర్తిగా తాను మాట్లాడిందేనని, అందులో ఎలాంటి కల్పితాలు లేవని, పూర్తిగా వాస్తవాలని వివరించారు.
నారాయణరెడ్డిపై స్టేషన్లో ఫిర్యాదు
మహదేవపూర్: బీజేపీ నాయకుడు, కాటారం పీఏసీఎస్ మాజీ చైర్మన్ చల్లా నారాయణరెడ్డిపై కాంగ్రెస్ మహదేవపూర్ మండల అధ్యక్షుడు అక్బర్‌ఖాన్ పార్టీ నాయకులతో కలిసి ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్‌మీడియా, యూట్యూబ్ చానళ్లలో నారాయణరెడ్డి.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వారి సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబుపై ఆధారం లేని అరోపణలు చేస్తూ వారి పరువుకు భంగం కలిగేలా కుట్ర పన్ని, శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా, రెచ్చగొట్టేలా మాట్లాడాడని ఎస్సై పవన్‌కుమార్‌కు వివరించారు. నారాయణరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, మాజీచైర్మన్ వామన్‌రావు, మాజీ ఎంపీటీసీ సుధాకర్, సమ్మయ్య పాల్గొన్నారు.
కుట్రపై సమగ్ర విచారణ జరిపించాలి
పుట్ట మధు రాజకీయంగా ఎదుగుతున్న దశలో అతనిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సోదరుడు శ్రీనుబాబుపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మంథనిలో బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్‌లాల్, ఎగోలపు శంకర్‌గౌడ్, కనవేన శ్రీనివాస్, అలుగువెల్లి వీరారెడ్డి, పోగుల సదానందం, బుద్ధార్థి రవి, కారెంగుల సుధాకర్, కమాన్‌పూర్ బీఆర్ఎస్ నాయకులు తాటి శంకర్, బొమ్మగాని అనీల్‌గౌడ్, పొన్నం రాజేశ్వరి, మేకల సంపత్యాదవ్తోపాటు పలువురు వేర్వేరుగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పుడు కూడా శ్రీధర్‌బాబు మంత్రి హోదాలోనే ఉండటం వల్ల పుట్ట మధుకు ప్రాణానికి హాని కలిగించే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యేగా, జడ్పీ మాజీ చైర్మన్‌గా పనిచేసిన పుట్ట మధుకు గన్మెన్లను తొలగించడం ఆ కుట్రలో భాగమేనని ఆరోపించారు. పుట్ట మధుకు ప్రభుత్వం భద్రత కల్పించాలని, గన్మెన్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఎలాంటి హాని జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
నారాయణరెడ్డి ఆరోపణలు అవాస్తవం
బీజేపీ నేత చల్లా నారాయణరెడ్డి మంత్రి శ్రీధర్‌బాబు, శ్రీనుబాబుపై చేస్తు న్న ఆరోపణలు అవాస్తవమని కాంగ్రెస్ నాయకులు ప్రసాద్, వొడ్నాల శ్రీనివాస్, శివ, సురేందర్‌రెడ్డి, ఉడుత పర్వతాల్యాదవ్, పేరవేన లింగయ్య పేర్కొన్నారు. శ్రీధర్‌బాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.