హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సాక్షిగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు. పురోగమిస్తున్న రాష్ట్రంపై అభాండాలు వేశారు. సభలో లేని వారి పేర్లను ప్రస్తావించకూడదనే సభా సంప్రదాయాన్ని విస్మరించి ముఖ్యమంత్రి కేసీఆర్పై అవాకులు, చెవాకులు పేలారు. ఒకటికి రెండుసార్లు కేసీఆర్ పేరును ప్రస్తావించడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రికార్డుల నుంచి కేసీఆర్ పేరును తొలగించాలని ఆదేశించారు. పెరిగిన ధరలపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ధరల పెరుగుదలకు కారణమైన కేంద్ర ప్రభుత్వ విధానాలను వదిలేసి, తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో రాష్ట్ర పన్నుల వాటాయే ఎకువని ఆరోపించారు. తెలంగాణలో మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్న విషయాన్ని విస్మరించి, ఉత్తరప్రదేశ్లో పంపిణీ చేస్తున్న 5 కిలోల బియ్యం గురించి గొప్పగా కీర్తించారు. మొత్తానికి లక్ష్మణ్ చేసిన ప్రసంగంపై తెలంగాణవాదుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.