ముషీరాబాద్/గోదావరిఖని, జనవరి 20: మాదిగల న్యాయమైన ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌ను పరిష్కరించకుండా కమిటీల పేరుతో కేంద్రంలోని బీజేపీ సర్కారు కాలయాపన చేస్తున్నదని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మండిపడ్డారు. గతంలోనే పలు కమిటీలు వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చినా మళ్లీ కమిటీ ఏర్పాటు చేయడమంటేనే మరోసారి మాదిగలను మోసం చేయబోతున్నట్టని చెప్పారు.
శనివారం విద్యానగర్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం 20 ఏండ్లుగా ఉద్యమిస్తున్నా పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టకుండా నాడు కాంగ్రెస్, నేడు బీజేపీలు మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పుతూ మాదిగల ఓట్లు అవసరం వచ్చినప్పుడల్లా కమిటీలు, కమిషన్లు అంటూ నాటకాలాడుతున్నారని విమర్శించారు. బీజేపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా త్వరలో జరిగే చివరి పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, లేదా రాష్ర్టాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకొనే అధికారాన్ని కట్టబెట్టాలని డిమాండ్ చేశారు.
దళితబంధును అమలు చేయాలి
దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని టీఎస్‌ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన టీఎస్‌ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులపై చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు. తక్షణమే దళితబంధు పథకాన్ని అమలు చేయాలని కోరారు.