న్యూఢిల్లీ, జూలై 20(నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ నంబర్ వన్ బ్లాక్‌మెయిలింగ్ పార్టీ అని, ఆ పార్టీ విధానాల కారణంగానే మణిపూర్ మండిపోతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మణిపూర్‌లో కుట్రలు చేస్తున్నదని, కొన్ని నెలలుగా అల్లర్లు జరుగుతున్నా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మణిపూర్‌లో అదానీ కంపెనీలకు 55 వేల ఎకరాల భూములు కట్టబెట్టడానికే తెగల మధ్య రిజర్వేషన్ అంశాలపై కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చారని విమర్శించారు. మణిపూర్ హింసాకాండపై కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 25న సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ‘మణిపూర్ సంఘీభావ దినం’ నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.