రైతాంగ పోరాటంలో వారి పాత్ర శూన్యం
మద్దూరు (ధూళిమిట్ట), సెప్టెంబర్ 15 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్ల్లింల పోరాటంగా వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గురువారం సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లి గ్రామంలో అమరవీరుల సంస్మరణ సభకు హాజరై చారిత్రక బురుజు వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముస్లిం రాజుకు వ్యతిరేకంగా కేవలం హిందువులే పోరాడినట్టు తప్పుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. షేక్‌బందగీ.. ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు గుర్తుచేశారు. మతాలకతీతంగా భూమికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నైజాంకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాటం చేశారన్నారు. ఏదైనా పోరాటం చేసిన చరిత్ర బీజేపీకి ఉన్నదా? అని ఆయన ప్రశ్నించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ బీజేపీ నాయకులు లేరన్నారు.
బీజేపీకి దేశభక్తి చరిత్ర లేదని, దేశద్రోహ చరిత్ర మాత్రమే ఉన్నదని విమర్శించారు. హిందూ, ముస్ల్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నదని, ఆ రకంగా తెలంగాణ అంతటా ఆ పార్టీ బలాన్ని పెంచుకోవాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. దాని కోసమే మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో బీజేపీ రాజీనామా చేయించిందని ఆరోపించారు. సమావేశం లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు తదితరులు పాల్గొన్నారు.