హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాలు… ఒకే నది… అదీ గోదావరి! రెండూ సాగునీటి ప్రాజెక్టులే… కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది మాత్రం రెండు నాల్కల వైఖరి. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రంవాల్ ఏకంగా నదిలోనే కొట్టుకుపోతే ఉలుకుండదు… పలుకుండదు. ఐదేండ్లలో విచారణలు, నివేదికలు అసలే ఉండవు. అయ్యో… భారీ వరదకు కొట్టుకుపోయిందంటూ దాని స్థానంలో కొత్త నిర్మాణానికి నిధులు సైతం మంజూరు చేస్తుంది. కానీ తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన వందల నిర్మాణాల్లోని ఒక బరాజ్‌లో ఒక్క పిల్లర్ కుంగిపోతే రాజకీయ బురదతో రాద్ధాంతం చేస్తున్నది. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు.. అసెంబ్లీ ఎన్నికల ముందొకటి! పార్లమెంటు ఎన్నికల ముందు మరొకటి!! బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల ముందు ఇంకోటి!! ఇలా ఏడాదిన్నరలో మూడు నివేదికలు ఇచ్చి చిలువలు పలువలు చేస్తున్నది. డిజైన్, నిర్మాణ లోపాలంటూ తన ఆధీనంలోని సంస్థతో ప్రాజెక్టునే ఎండబెట్టేలా పావులు కదుపుతున్నది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీలు మారినా సాగునీటి ప్రాజెక్టుల పనులు, ఫలాలు రైతులకు అందుతున్నాయి. అంతేకాదు, పరస్పర ఆరోపణలు చేసుకున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కొట్టుకుపోయిన డయాఫ్రం వాల్ స్థానంలో రూ.వెయ్యి కోట్లతో కొత్తదానిని నిర్మిస్తున్నది. కానీ, తెలంగాణలో అలా కాదు… నిత్యం రావణకాష్టంలా పిల్లర్ కుంగుబాటు అనేది ఓ రాజకీయాస్త్రంగా మారింది. పరస్పర నిరంతర ఆరోపణలకు పరిమితమైన రేవంత్ సర్కారు బరాజ్ పునరుద్ధరణ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడంలేదు.
పైగా రెండేండ్లపాటు సాగునీటికి రైతులు గోస పడుతున్నా లక్షలాది ఎకరాల్లో పంటలను ఎండబెడుతున్నదే తప్ప ప్రత్యామ్నాయ మార్గాలను చూడటం లేదు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకునేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలనేది ఎంత సత్యమో… తెలుగు రాష్ర్టాల్లో గోదావరి నదిపై రెండు సాగునీటి ప్రాజెక్టుల్లోని ఘటనలపై కేంద్రంలోని బీజేపీ తీరు, రైతుల శ్రేయస్సు పట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విజన్ ఎలా ఉన్నాయనేందుకు పోలవరం-కాళేశ్వరం ప్రాజెక్టులే ఉదాహరణ.
దశాబ్దాలుగా సాగునీటికి నోచుకోక పడావు పడిన భూములు… వలసపక్షులైన ప్రజలు… అసలే కొత్త రాష్ట్రం! ఒక సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం రెండు తరాలైనా ఎదురుచూడాలనేది అనుభవం. ఇలాంటి తరుణంలో జల సంకల్ప దీక్ష తీసుకొని అహోరాత్రులు శ్రమించి… కేసీఆర్ ప్రభుత్వం ఒక యజ్ఞంలా దేశ సాగునీటి చరిత్రలోనే రికార్డుస్థాయిలో మూడేండ్లలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా… తెలంగాణలో రికార్డుస్థాయి పంటలు పండాయని కలలో ఊహించేందుకు సైతం సాహసించని స్థితి. అలాంటిది నిన్నటి కేసీఆర్ ప్రభుత్వమే కాదు ఇప్పటి కాంగ్రెస్ సర్కారులోని సీఎం, మంత్రులు కూడా తెలంగాణ రికార్డుస్థాయి పంటలు పండిస్తున్నదని అధికారికంగా ప్రకటించే పరిస్థితి వచ్చింది. అందుకు కారణం… కాళేశ్వరం. మరి ఇలాంటి ప్రాజెక్టుపై ఏడాదిన్నరగా ఏం జరుగుతున్నది?!
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వడంతో డిజైన్ మొదలు నిధుల వినియోగం వరకు ప్రతి అంశంలోనూ కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధీనంలోని సంస్థల పర్యవేక్షణ ఉంటుంది. అంటే చిన్న తప్పిదమైనా ఇట్టే రట్టవుతుందని అనుకుంటాం. కానీ, పోలవరం ప్రాజెక్టు మాత్రం ఇందుకు భిన్నం. 2014-19 సమయంలో పోలవరం ప్రాజెక్టు అక్కడి అధికార పార్టీ టీడీపీకి ఏటీఎంలా మారిందనే ఆరోపణలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇన్నేండ్లలో ఒక్కసారైనా డిజైన్-నిర్మాణ లోపాలపై కఠినంగా వ్యవహరించిన సందర్భాలు లేవు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంపై మాత్రం బీజేపీ అడుగడుగునా వివక్ష చూపుతున్నది. రాష్ర్టానికి సంబంధించి కీలకమైన కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టులకు ఎలాంటి జాతీయహోదానూ ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఇప్పటికీ దాదాపు 52వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి.
ఆ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి రక్షణ చర్యలు చేపట్టాలని ఏళ్లుగా విన్నవించినా దిక్కులేకుండా పోయింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు డీపీఆర్‌కు అనుమతులను మంజూరు చేయడం కాదుకదా. ఏకంగా ఆ డీపీఆర్‌నే తిప్పిపంపింది. ఇక మేడిగడ్డ బరాజ్ ఘటన జరిగిన వెనువెంటనే ఎన్డీఎస్ఏను రంగంలోకి దించింది. విచారణ పేరిట హంగామా చేసింది. ఎలాంటి సాంకేతిక పరీక్షలను నిర్వహించకుండానే ప్రాజెక్టు లోపాలమయమంటూ రాద్ధాంతం చేసింది. ఏపీ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల విస్తరణపై ఫిర్యాదు చేస్తూ తెలంగాణ వందలలేఖలు రాసింది. కానీ ఇప్పటికీ ఒక్కదానిపైనా స్పందించి, ఏపీని నిలువరించకపోవడం గమనార్హం.