హైదరాబాద్, ఫిబ్రవరి 8 : ప్రధాని మోదీ మరోసారి తెలంగాణపై విషంకక్కారు. చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారంటూ పార్లమెంటు సాక్షిగా అడ్డగోలు వ్యాఖ్యలుచేశారు. తెలంగాణపై మోదీ మొదటినుంచీ అక్కసును వెలిబుచ్చుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచే.. మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా అవకాశం లభించిన ప్రతిసారీ మాట్లాడుతూనే ఉన్నారు. వాస్తవానికి ఉద్యమం తీవ్రస్థాయికి చేరేంతవరకూ బీజేపీ తెలంగాణ పట్ల సానుకూలంగా లేదు.
కాకినాడ తీర్మానానికి మంగళం
1998లో తెలంగాణ ఏర్పాటును సమర్ధిస్తూ కాకినాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. ‘ఒక ఓటు రెండు రాష్ర్టాలు’ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నెత్తికి ఎత్తుకున్నది. నాటి బీజేపీ నేతలు బంగారు లక్ష్మణ్, శేషగిరిరావు ఈ తీర్మానం పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడు కేంద్రంలోనూ వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభు త్వం అధికారంలో ఉన్నది. నోటిమాటకే తప్ప కేంద్రం పై పెద్దగా ఒత్తిడి తెచ్చిందే లేదు. 2000 నవంబర్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ర్టాలను ఏర్పాటుచేసింది. కానీ తెలంగాణను మాత్రం పక్కనబెట్టింది.
అద్వానీ తక్కువేం కాదు
‘అభివృద్ధిలో ప్రాంతాల మధ్య భేదాలు చూపుతున్నారనే కారణంతో రాష్ర్టాన్ని ఏర్పాటుచేయలేం. ప్రాంతీయ అసమానతలను అభివృద్ధి ద్వారా పరిష్కరించుకోవచ్చని.. అందుకే తెలంగాణ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని 2002లో అప్పటి ఎంపీ ఆలె నరేంద్రకు నాటి డిప్యూటీ ప్రధానమంత్రి ఎల్కే అద్వా నీ లేఖ రాశారు. ఇదే అద్వానీ.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి.. ‘రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ర్టాన్ని కోరడం ఏమిటి?’ అంటూ ఎద్దేవాచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్లేటు ఫిరాయించారు. ‘మేం తెలంగాణను ఎప్పుడో ఏర్పాటు చేయాల్సింది. భాగస్వామ్యపక్షాల ఒత్తిళ్ల వల్ల ఏర్పాటు చేయలేకపోయాం’ అంటూ కుంటిసాకులు చెప్పారు.
తెలంగాణ బీజేపీ నేతలు ఏమంటారు?
తాము మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందంటూ హడావుడి చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పు డేం చెప్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘బండి సంజ య్.. మోదీ వ్యాఖ్యలను నువ్వు సమర్థిస్తున్నావా’ అంటూ నిలదీస్తున్నారు. ‘కిషన్రెడ్డీ.. మౌనంగా ఉం టే మోదీ వ్యాఖ్యలను మీరు స్వాగతించినట్టు అనుకోవాల్సి వస్తుంది’ అని హెచ్చరిస్తున్నారు.
మోదీ.. మొదటి నుంచీ అక్కసే
ఎక్కడి పాట అక్కడ పాడినట్టు.. తెలంగాణ ఏర్పాటుపై పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంలో ప్రధాని నరేంద్రమోదీకి సరితూగేవాళ్లే లేరు. ‘కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటుచేయడం స్వాగతించదగ్గ నిర్ణయం. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇన్నేండ్లుగా కమిటీలు, రిపోర్టులు అంటూ విభజనను ఆలస్యం చేసినందుకు తెలుగు ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్తుందా?’ అంటూ 2013 జూలై 30న వ్యాఖ్యానించిన మోదీ.. ఆరు నెలల్లోనే నాలుక మడతపెట్టేశారు. ‘తల్లిని చంపి బిడ్డను బతికించినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. సీమాంధ్ర ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనాథగా మార్చివేసింది’ అంటూ 2014 ఫిబ్రవరి 28న కర్ణాటకలోని గుల్బర్గాలో అక్కసు వెళ్లగక్కారు. ప్రధాని అయిన తర్వాత సందర్భం వచ్చిన ప్రతిసారి తెలంగాణపై విషం కక్కుతూనే ఉన్నారు.
తెలంగాణ అంటేనే మోదీకి అక్కసు
దేశ అత్యున్నత సభలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం ఇది రెండోసారి. రాష్ట్రం పట్ల మోదీకి ఉన్న పూర్తి వ్యతిరేకత బయటపడింది. ఆనాటి విభజనను మళ్లీమళ్లీ ప్రస్తావిస్తూ పరిష్కరించాల్సిన అంశాలను పక్కన పడేస్తున్నారు. ఒక్క ఓటు రెండు రాష్ర్టాలు అని కాకినాడ తీర్మానానికి కట్టుబడి ఎల్కే అద్వానీ, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి లాంటి వారు మద్దతు ఇచ్చినా మోదీ అడ్డుపడ్డారు. ముందు నుంచీ చివరి నిమిషం దాకా తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో కనీస కేటాయింపులు లేకపోవడం చూస్తుంటే ఆయన వ్యతిరేకత ఏపాటిదో అర్థమవుతున్నది.
– అల్లం నారాయణ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్
వెంకన్న సాక్షిగా ప్రమాణం ఏమైంది?
రాష్ట్ర విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తలుపులు మూస్తే.. మీరెందుకు మద్దతు ఇచ్చినట్టు. పార్లమెంటు సాక్షిగా బాధ్యత మరిచి ప్రధాని ప్రసంగించడం విడ్డూరంగా ఉన్నది. ఏడేండ్లుగా రెండు రాష్ర్టాలకు జరిగిన నష్టాన్ని సరిచేసేందుకు పార్లమెంటులో రూపొందించిన విభజన చట్టాన్ని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయడంలేదు. తిరుమల వెంకన్న సాక్షిగా ఏపీకి అనేక హామీలు ఇచ్చారు. ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ హోదా, రైల్వే జోన్లు, విశాఖ పెట్రోకెమికల్, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే కదా? ఏడేండ్లలో ఎందుకు చర్యలు తీసుకోలేదు. – ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ
వ్యతిరేకం కాదంటూనే..
తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే ప్రధాని మోదీ తన వ్యతిరేకతను ప్రకటిస్తున్నారు. రాష్ట్రం నుంచి మొదలుకొని జాతీయస్థాయిలో తెలంగాణ పట్ల బీజేపీ నాయకులందరూ ద్వంద్వ నీతితో వ్యవహరిస్తున్నారు. ఒక వర్గం అనుకూలం గా.. మరో వర్గం ప్రతికూలంగా ఉంటూ వస్తున్నది. రైల్వేలు, రోడ్లు, విశ్వవిద్యాలయాలతోపాటు విభజ న అంశాల్లోని చా లా విషయాలను పరిష్కరించడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన అంశాల పట్ల మొండివైఖరితో వ్యవహరిస్తున్నది. ఇప్పటికైనా ప్రధాని మోదీ జాతీయ నేతగా హుం దాగా వ్యవహరిస్తే బాగుంటుంది. లేదంటే తెలంగాణ సమాజం వారిని ఆదరించదు.
– మల్లేపల్లి లక్ష్మయ్య, చైర్మన్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్
గోబెల్స్‌ను మించి మోదీ అబద్ధాలు
ప్రధాని మోదీ గోబెల్స్‌ను మించిపోయేలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు. అలాంటి మహానుభావుడు దేశానికి ప్రధాని కావడం దురదృష్టకరం. పార్లమెంటులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇవ్వలేదా? రాష్ర్టాన్ని విభజించినప్పుడు తలుపులు వేసుకొని, చర్చలేకుండా ఆమోదింపచేశారని అంటున్న మోదీ.. ఆ నాడు లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్షనాయకులుగా ఉండి తెలంగాణ బిల్లును ఆమోదింపచేసిన దివంగత సుష్మాస్వరాజ్, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును అవమానించారు. విభజనను ఆ నాడు అందరూ ఆమోదించారు. అవన్నీ వదిలేసి ఇప్పుడు మోదీ అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటు.
– నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
విభజన హామీల నుంచి తప్పించుకొనేందుకే
విభజన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్రలో భాగంగానే ప్రధాని మోదీ ఇలా మాట్లాడుతున్నారు. తెలంగాణ, ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. రాష్ర్టాల గురించి పార్లమెంటులో మాట్లాడటం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏడేండ్ల క్రితం జరిగిన విభజన గురించి ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టడం దేనికి సంకేతం. రెండు రాష్ర్టాల అభివృద్ధి, నిధులు, వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు, ఆర్థిక సాయాలు, ఇతర ప్యాకేజీల గురించి ప్రధాని మాట్లాడితే బాగుంటుంది. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోని అంశాలను లాగేసుకోవడం ద్వారా మోదీ సర్కార్, రాష్ర్టాల హక్కులను హరించేస్తున్నది.
– తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
అవహేళన చేసేలా మోదీ వ్యాఖ్యలు
రాష్ట్ర విభజనపై పార్లమెంటులో ప్రధాని మోదీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు, అమరుల బలిదానాలను అవహేళన చేసేలా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలతో మోదీ పదేపదే తెలంగాణపై వ్యతిరేకతను చాటుకుంటున్నారు. పోలవరం ముంపు మండలాలను ఏకపక్షంగా ఏపీలో కలపడం మొదలు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఒక ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, గిరిజన వర్సిటీ, ఏపీ విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా తెలంగాణతో ఆడుకొంటున్నారు. రాష్ర్టానికి కొంగుబంగారమైన సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారు.
– చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఉద్యమ నేలను అవహేళన చేస్తే పతనమే
ఉద్యమ నేలను అవహేళన చేసేలా ఎవరు మాట్లాడినా పతనం ఖాయం. ప్రధాని మోదీ తెలంగాణపై విషయం కక్కడం పరిపాటిగా మారింది. బీహార్ ఎన్నికల్లో మొదలుకొని పార్లమెంటులో ప్రగల్భాలు పలుకుతున్నారు. మళ్లీ ఇప్పుడు రాజ్యసభలో స్థాయిని దిగజార్చుకొనేలా మాట్లాడటం వారికే చెల్లింది. మోదీ వ్యాఖ్యలతో రాష్ట్రంలో బీజేపీ మూల్యం చెల్లించుకోనున్నది. విభజ చట్టంలోని హామీలన్నీ తుంగలో తొక్కి మతిభ్రమించి మాట్లాడుతున్నట్టు ఉన్నది. ఏడేండ్లలో ఒక్కటంటే ఒక్క హామీని పరిష్కరించని ప్రధాని ఉండేంలాభం. ఇకనైనా చట్టసభల సాక్షిగా దిగజారుడు మాట్లాడకుంటే మంచింది.
– మన్నె క్రిశాంక్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్
ఓర్వలేక విషపు మాటలు
ప్రధాని మోదీ వ్యాఖ్యలు దురదృష్టకరం. రాష్ట్ర ఏర్పాటును ఆయన ఎంతగా వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు అర్థమవుతున్నది. ఒక పక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదంటూనే తెలంగాణపై విషం చిమ్ముతున్నారు. ప్రధాని వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నేతలు సమాధానం చెప్పాలి. తెలంగాణపై అంత ప్రేమ ఉంటే విభజన హామీలు నెరవేర్చాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక మోదీ విషం చిమ్ముతున్నారు.
– అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
బీజేపీని లేకుండా చేస్తాం
తెలంగాణపై కేంద్రం విషం కక్కుతున్నది. ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఆక్షేపణీయం. తెలంగాణ చరిత్ర, ఉద్యమ నేపథ్యాన్ని తెలుసుకొని మాట్లాడాలి. 1960 నుంచి 2014 వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం వేల మంది ఆత్మత్యాగాలు చేశారు. ఇందు లో దళిత, గిరిజన, బీసీ ఇతర అన్ని వర్గాలవారు ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. తెలంగాణ పట్ల కుట్రలు, కుతంత్రాలు చేయడం మానుకోవాలి. లేని పక్షంలో దేశంలో బీజేపీని లేకుండా చేస్తాం.
– గజ్జెల కాంతం, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్