BJP | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతిలో బీజేపీ పావులా మారిందని, ఆయన రాజకీయ అవసరాల కోసం పార్టీని వాడుకుంటున్నాడని పాతతరం బీజేపీ నేతలు, సంఘ్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. తన చేతికి మట్టి అంటకుండా బీజేపీ భుజం మీద రేవంత్ తుపాకీ పెట్టి తన రాజకీయ ప్రత్యర్థులను కాల్చుతున్నారని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డికి గాని, కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని ఏవైనా పెద్ద సమస్యలు ఎదురైన సందర్భంలో రాష్ట్ర బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కూడా అనుమానాలకు తావిస్తున్నదని చెప్తున్నారు. అంశాన్ని పక్కదోవ పట్టించేలానో.., తీవ్రతను తగ్గించేలానో కొందరు బీజేపీ నేతలే వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారు. బీజేపీ ముఖ్యనేతలు అత్యధిక శాతం కాంగ్రెస్ మీద కన్నా బీఆర్ఎస్ పైనే విమర్శలు చేయడాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు. మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి ట్రాప్‌లో బీజేపీ పడిందన్న చర్చ మాత్రం సంఘ్, బీజేపీ సీనియర్ నేతల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నది. దీనివల్ల బీజేపీకి ఏం లాభమని కూడా చర్చించుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే బీజేపీ సహకారం స్పష్టంగా కనిపిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పరిచయాలను కూడా వాడుకుంటున్నారనే చర్చ నడుస్తున్నది.
బీజేపీ నేతలు ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని, బిల్లుల మంజూరుకు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ భట్టి విక్రమార్కను మాత్రమే టార్గెట్ చేశారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. వివిధ శాఖల్లోని అవినీతిని ప్రభుత్వ అవినీతిగా చూపించి, ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాల్సింది పోయి కేవలం మంత్రుల వ్యక్తిగత అవినీతిగా చిత్రీకరించడం వెనుక మర్మమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూసీ ప్రాజెక్టు, హైడ్రా మీద కూడా పార్టీ ఒక పాలసీ ప్రకారం వెళ్లకపోవడం కూడా రేవంత్ వ్యూహంలో భాగమేనా? అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. హైడ్రాకు అనుకూలంగా ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడితే, కూల్చివేతలను అడ్డుకుంటామని ఎంపీ ఈటల రాజేందర్ విరుద్ధ ప్రకటనలు చేశారని గుర్తు చేస్తున్నా రు. మూసీ కూల్చివేతల విషయంలోనూ ఇలా గే ఒక పద్ధతి లేకుండా ‘మేము ప్రాజెక్టుకు అ నుకూలమే.. కానీ పేదల ఇండ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోం’ అంటూ డొంకతిరుగుడు ప్రకటనలతో ప్రజల్లో చులకన అయ్యామని సీనియర్ బీజేపీ నేతలు వాపోతున్నారు.
ఇప్పు డు బీజేపీకి అత్యంత సన్నిహితుడైన ఆదానీకి చెందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని నల్లగొండలో మూసీ నది ఒడ్డున ఏర్పాటు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కూడా బీజేపీ నోటికి తాళం వేసినట్టయిందని వాపోతున్నారు. కొన్నాళ్లుగా కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ వ్యవహార శైలి కూ డా విచిత్రంగా కనిపిస్తున్నదని అంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి సమస్య ఎదురైనప్పుడు, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు బండి సంజయ్ రంగంలోకి దిగి, బీఆర్ఎస్పై విమర్శలు చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాడని చర్చించుకుంటున్నా రు. పార్టీలో కిషన్‌రెడ్డికి, ఇతర నేతలకు మధ్య ఉన్న విభేదాలను రేవంత్‌రెడ్డి తన అవసరాల కు వాడుకుంటున్నారన్న వాదనలు కూడా వస్తున్నాయి.
కేంద్రంతో సన్నిహిత సంబంధాలు
సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని బీజేపీ సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రధానిని బడేభాయ్ అని సంబోధించడం, కేంద్ర మంత్రుల పర్యటనల సమయంలో సంప్రదాయానికి భిన్నం గా ఆహ్వానాలు పలకడం వంటివన్నీ ఇందులో భాగమేనని చెప్పుకొంటున్నారు. కాంగ్రెస్ అలవిగాని హామీలిచ్చి అమలు చేయడంలో విఫలమవుతున్నదని, రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడం లో వెనుకబడిందని విమర్శిస్తూ ప్రధాని మోదీ ఈ నెల 1న ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలిత తె లంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో అభివృద్ధి కనిపించడం లేదని, ఆర్థిక విపత్తు దిశగా సాగుతున్నాయని విమర్శించారు. కా నీ.. వెంటనే ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. రేవంత్‌రెడ్డితో సాన్నిహిత్యం వల్లే ఇలా చేశారనే ప్ర చారం సాగుతున్నది. మరోవైపు రేవంత్‌రెడ్డి కో రినప్పుడల్లా ఢిల్లీలో ప్రధాని, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయని, వాస్తవానికి కొన్నాళ్లుగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానమే పక్కనబెట్టిందని, ఆయనకు పెద్దగా సమయం ఇవ్వడంలేదని, కానీ బీజేపీ పెద్దలు మాత్రం గంటలపాటు సమావేశమవుతున్నారని చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో తన ప్రత్యర్థి అయిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఈడీ దాడులు జరగడం, ఇది సోష ల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం కావడం ఈ పరిచయాల్లో భాగమేనన్న చర్చ కూడా వి పరీతంగా జరుగుతున్నది. తన ప్రత్యర్థులను ఇరికించేందుకు కొందరు ఐఏఎస్ అధికారులపైనా కేంద్ర నిఘా సంస్థలకు సమాచారం ఇ చ్చారని ఆరోపిస్తున్నారు. ఇలా కేంద్రంతో తనకున్న సంబంధాలను ప్రొజెక్ట్ చేసుకుంటూ రాష్ట్ర నేతల్లో గందరగోళం సృష్టిస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఎందుకీ మెతకవైఖరి?
సాధారణంగా హిందూత్వం, ఆలయాలకు సంబంధించిన అంశాల్లో బీజేపీ, అనుబంధ సంఘాలు తీవ్రంగా స్పందిస్తుంటాయి. కానీ.. ఇటీవల తెలంగాణలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ఎందుకు పెద్దగా స్పం దించడం లేదని సంఘ్ నేతలే అనుమానిస్తున్నట్టు తెలిసింది. సికింద్రాబాద్ ఘటన నుంచి మొదలు అనేక అంశాలు తెరమీదికొచ్చినా.. స్థానికంగా ర్యాలీలు, ఆందోళనలు తప్ప పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదని సీనియర్ నేతలు భావిస్తున్నట్టు తెలిసింది. కర్ణాటక, బెంగాల్ తదితర రాష్ర్టాల్లో మాదిరిగా ఇక్కడ ఎందుకు దూకుడుగా లేరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని ఎజెండా ఎత్తుకున్నదే ప్రధాని మోదీ అని, మందకృష్ణ మాదిగ నిర్వహించిన సభకు కూడా మోదీ వచ్చారని గుర్తుచేస్తున్నారు. కానీ.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని బీజేపీ పెద్దగా ఒత్తిడి తేలేదని విశ్లేషిస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై మందకృష్ణ మాదిగ పోరాడుతుంటే భుజం కలపాల్సిందిపోయి బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటున్నదని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించిన నేతల ముందరి కాళ్లకు ఇప్పుడు బంధం వేశారన్న చర్చ కూడా సాగుతున్నది. ఇందుకు ధర్మపురి అర్వింద్‌ను ఉదాహరణగా చూపుతున్నా రు. బీఆర్ఎస్ హయాంలో ఆయనతో హైదరాబాద్, ఢిల్లీలో ప్రెస్మీట్లు పెట్టించి, విమర్శలు చేయించారని, ఇప్పుడు మాత్రం నిజామాబాద్‌కే పరిమితం చేశారని విశ్లేషిస్తున్నారు. .
బీజేపీకి ఏం లాభం?
సాధారణంగా ప్రభుత్వం ఓవైపు, ప్రతిపక్షా లు మరోవైపు ఉండి పనిచేస్తాయని, అంశాల ఆధారంగా ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తుంటాయని, ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నదని చెప్తున్నారు. ‘రేవంత్‌రెడ్డి మన వేలితో మ న కంటినే పొడుస్తున్నాడు’ అని సంఘ్ నేతలు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ఎదగడం జాతీయంగా బీజేపీకి నష్టం. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించిం ది. కాబట్టి కాంగ్రెస్ మీద వీలైనంత ప్రజా వ్య తిరేకత పెంచేలా బీజేపీ వ్యవహరించాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ భిన్నంగా ప్రవర్తిస్తుండటంతో క్యాడర్‌లోనూ ఆందోళన నెలకొన్నదని చెప్పుకొంటున్నారు. రేవంత్ గేమ్‌ప్లాన్‌లో బీజేపీ ఎందుకు భాగం కావాలని చర్చించుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయంగా మై లేజీతోపాటు అదనపు ప్రయోజనాలు పొందుతున్నారని చెప్తున్నారు. అటు రాజకీయంగా కలిసిరాక, ఇటు ఇతర ప్రయోజనాలు అందక బీజేపీ రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని నిట్టూరుస్తున్నారు. ఈ వ్యవహారశైలిపై బీజేపీలోని కొందరు నేతలు విసుగు చెందుతున్నారని, తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాష్ట్ర అధిష్ఠానానికి చురకలంటించారని చెప్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచినా, అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు అధికారంలోకి రాలేకపోయామో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారని గుర్తుచేస్తున్నారు.