హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ దేనిపైనైతే ఆందోళన వ్యక్తంచేశారో.. ఇప్పుడు అదే అక్షరాలా జరుగుతున్నది. పచ్చటి తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్రపూరిత పన్నాగానికి పూనుకొన్నది. అధికార ఉన్మాదం తలకెక్కిందంటే.. ఆ ఉన్మాద స్థితిలో ఏదీ కనిపించదు. శిక్ష పడదు.. కనీసం శిక్షాభయమూ ఉండదు. ఎవరు, ఎప్పుడు, ఎట్లాగైనా పెట్రేగిపోవచ్చు. ఏదైనా వాగవచ్చు. అయినా ఏమీ జరుగదు. ఏదో తాత్కాలికంగా సస్పెండ్ చేశామని అనిపిస్తారు. వారిపై ఎలాంటి చర్యలు ఉండవు.. ఇవాళ భారతీయ విలువలన్నింటినీ కాలరాసి ఒక సమాజాన్ని దారుణంగా కించపరిచే నైచ్యానికి ఒడిగట్టినా.. వారి పార్టీ ఏమనదు. శాసన వ్యవస్థ ఏమీ చేయదు.. న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మొన్నటికి మొన్న నూపుర్ శర్మ వ్యాఖ్యలు జాతీయ, అంతర్జాతీయంగా దేశం పరువును మంటగలిపాయి. ఆ వేడి ఇంకా చల్లారనే లేదు. ఇప్పుడు ఎనిమిదేండ్లుగా అత్యంత ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అశాంతికి ఆజ్యం పోసింది. ఇప్పుడు ఏకంగా తన ఎమ్మెల్యే రాజాసింగ్ ద్వారా.. నాడు నూపుర్‌శర్మ ఏవైతే వ్యాఖ్యలు చేసిందో.. వాటిని మరింత వెటకారంగా చెప్తూ ఏకంగా ఓ వీడియోనే విడుదలయ్యేలా చేసింది. ఊహించినట్టుగానే అలజడి రేగడంతో వీడియో డిలిట్ అయింది. నూపుర్ మాదిరిగానే సదరు నేత కూడా సస్పెండ్ అయ్యారు. సహజంగానే వారి సోషల్ మీడియా.. రాజాసింగ్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ అనుకూల ప్రతికూల వాదాలతో నిప్పు రాజేయడం మొదలుపెట్టింది.
నిలువెల్లా విషం
‘ఖలునకు నిలువెల్ల విషము’ అని సుమతీ శతక కారుడు చెప్పినట్టుగానే.. ఇప్పుడు బీజేపీ నేతల కాలకూట విషం బయటికొస్తున్నది. ప్రశాంత తెలంగాణలో మత చిచ్చు రాజేసేందుకు బీజం వేసింది. కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణ.. ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా దూసుకుపోతున్న తరుణంలో.. ఇక్కడి శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు నీచ రాజకీయానికి ఒడిగట్టింది. తెలంగాణలో బీజేపీ నేతలు గత రెండేండ్లుగా విషం చిమ్ముతున్నారు. సాక్షాత్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విలువలన్నింటికీ తిలోదకాలిచ్చి.. విద్వేషం వెదజల్లుతున్నారు. మసీదులన్నింటినీ తవ్వుదాం.. శివం వెలికి వస్తే మేం తీసుకొంటాం.. శవం వస్తే మీరు తీసుకోండంటూ బరితెగించారు. దేశ స్వాతంత్య్రం కోసం ముస్లిమేతరులే పోరాడారన్నారు. ప్రజా సంగ్రామయాత్ర పేరుతో కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న బండి.. అడుగడుగునా హిందువులను రెచ్చగొడుతున్నారు. ఎవరైనా ధరల పెరుగుదలపై ప్రశ్నిస్తే.. ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. చివరకు భగవద్గీత ఆడియో వినిపిస్తే.. అంతిమయాత్రలపైనా భౌతిక దాడులు చేస్తామనే స్థాయికి బండి సంజయ్ దిగజారిపోయారు. మొన్నటికి మొన్న పంద్రాగస్టునాడు.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జనగామ జిల్లా మీదికొండలో కాంగ్రెస్ కార్యకర్త శ్రీరాములును పలకరించిన బండిసంజయ్.. అతని నుంచి టీఆర్ఎస్ అన్ని పథకాలు అందిస్తున్నదని జవాబు రావడంతో కంగు తిన్నారు. సహనం కోల్పోయిన బండి అనుచరులు అతడిపై దాడిచేశారు.
స్వరాష్ట్రంలో తొలిసారిగా…
రెండుమూడేండ్లుగా ప్రతీప శక్తులు ఎన్ని కుతంత్రాలు చేస్తున్నా.. తెలంగాణ ప్రశాంత, సుహృద్భావ వాతావరణం చెడిపోవడం లేదు. సీఎం కేసీఆర్ అమలు చేసిన సంస్కరణల ఫలితంగా శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లడం లేదు. దీంతో ఎలాగైనా తెలంగాణలో చిచ్చు పెట్టాలని బీజేపీ నిర్ణయించింది. పక్కా ప్లాన్ ప్రకారమే తాజాగా కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశారు. ఇది దావానలంలా మారింది. ముస్లిం సమాజం భగ్గుమన్నది. దీంతో స్వరాష్ట్రంలో తొలిసారిగా పాతబస్తీలో కలవరపాటు మొదలైంది. బంద్ వాతావరణం నెలకొన్నది. ఓవైపు బండి సంజయ్ పాదయాత్ర, ధర్మ దీక్ష వంటి డ్రామాలు ఆడుతూ, మరోవైపు రాజాసింగ్ వంటి నేతలు విద్వేష వ్యాఖ్యలు చేస్తూ శాంతిభద్రల సమపస్యలు సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ‘మద్దతు’
నువ్వు గిల్లినట్టు చెయ్యు.. నేను కొట్టినట్టు చేస్తా.. అన్న చందంగా.. సున్నితమైన అంశాలపై కావాలనే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం.. తర్వాత తూతూ మంత్రంగా అరెస్టులు, పార్టీ నుంచి సాగనంపడాలు.. ఆనక సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా బెయిలు రావడం.. తిరిగి యథాతథం. ఇదీ స్థూలంగా బీజేపీ నేతలు ఆడుతున్న కొత్త నాటకం.గతంలో నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా దుమారం రేగింది. ఈ క్రమంలో బీజేపీ పకడ్బందీగా వ్యూహం అమలుచేసింది. ఒకవైపు అంతర్జాతీయ సమాజానికి నిస్సిగ్గుగా క్షమాపణ చెప్తూనే.. మరోవైపు నూపుర్‌పై ఈగ వాలకుండా జాగ్రత్తపడింది. కాకపోతే దిద్దుబాటు చర్యల పేరుతో నూపుర్ వ్యాఖ్యలపై అలజడి రేగిన వెంటనే పార్టీనుంచి ఆమెను సస్పెండ్‌చేశారు. తరువాత నెమ్మదిగా నూపుర్‌కు మద్దతు గళాలు మాట్లాడటం మొదలుపెట్టాయి.
ఐ సపోర్ట్ నూపుర్ అంటూ బీజేపీ అనుకూల సామాజిక మాధ్యమాల్లో హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. డీపీలు వెలిశాయి. ఈ భావోద్వేగానికి గురైన పాపానికి రాజస్థాన్‌లో ఒక టైలర్ అన్యాయంగా హతమయ్యాడు. వీళ్లకంటే ముందు సాధ్వీ నిరంజన్ జ్యోతి, ప్రగ్ఙసింగ్ ఠాకూర్ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను కీర్తించిన ప్రగ్ఙసింగ్పైనా ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు తెలంగాణలో రాజాసింగ్ తయారయ్యారు. నూపుర్ చేసిన వ్యాఖ్యలకే మరింత వెటకారాన్ని జోడించి ఏకంగా వీడియోనే విడుదలచేశారు. మళ్లీ సేమ్‌సీన్ రిపీట్.. రాజాసింగ్ సస్పెన్షన్ డ్రామాకు తెరలేచింది. పది రోజుల గడువుతో ఓ షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. అదే తతంగం.. ఇక్కడ తెలంగాణలో జరిగింది కాబట్టి.. తెలంగాణ పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు కాబట్టి వెంటనే అరెస్టు చేశారు. వెంటనే బీజేపీ సోషల్ మీడియా అలర్ట్ అయింది. ఐ సపోర్ట్ రాజాసింగ్ అన్న హ్యాష్‌ట్యాగ్ పుట్టుకొచ్చింది. అదేసమయంలో వ్యతిరేక వర్గమూ రాజాసింగ్‌పై మండిపడటం మొదలైంది. నిన్నటివరకు నూపుర్.. ఇప్పట్నుంచి రాజాసింగ్.. వెరసి ఈ చితిని బీజేపీ ఎప్పటికీ రగుల్చుతూనే ఉంటుంది. త్వరలో మునుగోడు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ప్రజలంతా టీఆర్ఎస్వైపే ఉండటంతో ఎలాగైనా వారి దృష్టిని మళ్లించాలని, రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని కుట్రలు జరుగుతున్నట్టు వరుస ఘటనలను బట్టి స్పష్టంగా అర్థమవుతున్నది.
అంతా అమిత్ షా కనుసన్నల్లోనే!
రాష్ట్రంలో రగులుతున్న మంటలు అమిత్ షా కనుసన్నల్లోనే జరుగుతున్నాయని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నెల 21న అమిత్ షా తెలంగాణకు వచ్చిన క్రమంలో చోటుచేసుకొన్న పరిణామాలు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. అమిత్ షా ఎక్కడికి వెళ్లినా ముందుగా శాంతి భద్రతలు అదుపుతప్పేలా తన అనుచరులతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయిస్తారని, తద్వారా ప్రజల మధ్య గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందుతారని, శాంతి భద్రతలు కాపాడేందుకు అరెస్ట్ చేస్తే ధర్నాలు, రాస్తారోకోలతో అలజడి సృష్టిస్తారని చెప్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు అక్షరాలా జరిగింది ఇదే.
పారిశ్రామికాభివృద్ధికి విఘాతం
కొంతకాలంగా రాష్ట్రంలో బీజేపీ సృష్టిస్తున్న విద్వేషపూరిత వాతావరణం పారిశ్రామిక రంగానికి పెనుశాపంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండేండ్ల కొవిడ్ కాలంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ రంగం, ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే, తాజాగా బీజేపీ సృష్టిస్తున్న అలజడి పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం వ్యవసాయంతోపాటు పారిశ్రామికరంగానికి పెద్దపీట వేసింది. టీఎస్ ఐపాస్‌తో రాష్ర్టాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చింది. ఎనిమిదేండ్లలో దాదాపు 53 నూతన ఇండస్ట్రియల్ పార్క్‌లను ఏర్పాటు చేసింది. మరో 20కి పైగా పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఇతర రాష్ర్టాలను కాదని మన రాష్ట్రంలో కొలువుదీరాయి. గత ఎనిమిదేండ్ల్లలో టీఎస్ ఐపాస్ ద్వారా 19,897 వివిధ స్థాయిల పరిశ్రమలకు అనుమతులు మంజూరు కాగా, వీటి ద్వారా రాష్ర్టానికి రూ. 2,34,396 కోట్ల మేర పెట్టుబడులు సమకూరాయి. వీటిద్వారా 16,56,460 ఉద్యోగాలు లభించాయి.
ఐటీ రంగం పెట్టుబడులు రూ.66,276 కోట్ల నుంచి 2020-21 నాటికి రూ.1,45,522 కోట్లకు పెరిగాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల పోకడలపై పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. శాంతికి భంగం కలిగితే కొత్త పెట్టుబడులు రాకపోవడమే కాకుండా మన ఉత్పత్తులు సైతం మార్కెటింగ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని వారు వాపోతున్నారు. ఇలాంటి ఉద్రిక్త వాతావరణం పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న స్నేహపూర్వక విధానాలకు తోడు ఇక్కడున్న కాస్మొపాలిటన్ కల్చర్, ప్రశాంత వాతావరణం పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చిందన్నారు. ఇది చెదిరిపోకుండా ప్రభుత్వం కాపాడాలని విజ్ఞప్తి చేశారు.