మహబూబ్నగర్ : కేంద్రంలోని బీజేపీ పార్టీ వందేళ్ల అబద్ధాలను అప్పుడే చెప్పేసింది. అధికారం కోసం అబద్ధాలను నమ్ముకున్న ఏకైక పార్టీ బీజేపీ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలోని మూసాపేట మండల కేంద్రంలో కేంద్రమే వడ్లను కొనుగోలు చేయాలనే నినానదంతో టీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ రైతులతో సమావేశం నిర్వహించి కేంద్రం రైతుల పంటలు కొనడం లేదని, తాము అధికారంలోకి వస్తే రైతులు పండించిన అన్ని పంటలు కొంటామని చెప్పారు.
కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రణాళికాబద్ధంగా అబద్ధాలతో ప్రజలను నమ్మించారని ధ్వజమెత్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ చెప్పిన మాటల ఆధారాలను మంత్రులు, ఎంపీల బృందం చూపితే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మొహంలొ నెత్తురు చుక్క లేదు. కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా దేశంలోని రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలన సరిగా లేకుంటే ప్రజలు శిక్షిస్తారు. మీ శాపనార్థనాలతో కేసీఆర్కు ఒరిగేది ఏమీ లేదన్నారు. వెయ్యేళ్ల కింద రాజులు కట్టిన దానికంటే రెట్టింపుగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించారు. దేశమంతా తిరిగి బీజేపి బండారాన్ని బయటపెడతామన్నారు. ధాన్యం కొనే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు.