మర్రిగూడ, సెప్టెంబర్ 10: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో గుబాళించేది గులాబీయేనని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ విజయం ఖాయమైందన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని కొండూరుకు చెందిన కాంగ్రెస్ ఉప సర్పంచ్ పాలకూర్ల జంగయ్య, వార్డు సభ్యులు ఎండీ జహంగీర్, పగడాల రాములు, ఆంబోతు రాజేందర్, పలువురు నాయకులు శనివా రం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కమలం పార్టీకి తె లంగాణలో స్థానం లేదని, కాంగ్రెస్ ఢిల్లీలో లేదు.. గల్లీలో రాదని మంత్రి విమర్శించారు.
టీఆర్ఎస్లో పలువురి చేరిక
మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం నామాపురంలో కాంగ్రెస్‌కు చెందిన 10 కుటుంబాలు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం 8వ వార్డులో కాంగ్రెస్, తెలుగుదేశంకు చెందిన సుమారు 200 మంది, సంస్థాన్ నారాయణపురం గుండ్లమెట్ల కాలనీకి చెందిన 60 మంది, పుట్టపాకకు చెందిన 30 మంది వివిధ పార్టీల కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొన్నారు.