వనపర్తి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజకీయాలు తప్పా రైతాంగం మీద ప్రేమ లేదు. నూతన వ్యవసాయ చట్టాలతో ప్రధాని మోదీ రైతుల మెడలకు ఉరితాళ్లు పేనుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతుల నుంచి యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
యాసంగి వడ్లు కొంటామని కేంద్రంతో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పించండి. లేదంటే కారణాలు చెప్పాలనన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రైతుల మీద మనస్సులేదు. వ్యవసాయం అంటే తెలివి లేదు. దేశ ప్రజల ఆస్తులు అమ్మడం తప్పా రైతుల వడ్లు కొనే విధానం లేదని ఘాటుగా విమర్శించారు.
దేశంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను మించిన రాష్ట్రం లేదని మంత్రి పేర్కొన్నారు.
దేశంలో పండిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలని రాజ్యాంగం చెబుతున్నది. అయినా బీజేపీ ప్రభుత్వం మొండిగా ప్రవరిస్తున్నదని మండిపడ్డారు.
దేశ ఆస్తులన్నీ అంబానీ, ఆదానీలకు తాకట్టు పెడుతూ రైతుల నోళ్లలో మట్టికొట్టే చట్టాలు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మీ వల్ల దేశంలో 600 మంది రైతులు చనిపోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని డిమాంచ్ చేశారు. టీఆర్ఎస్ రైతు సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి నూకలు చెల్లడం ఖాయమన్నారు. కేంద్రం ధాన్యం కొనేంత వరకు ఉద్యమిస్తామని మంత్రి తెలిపారు.