(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలతో కుదేలైన పేదలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు మరో షాక్ ఇచ్చింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌పై తాజాగా రూ.101.5 బాదింది. నెల రోజుల వ్యవధిలో ధరలను పెంచడం ఇది రెండోసారి. పెంచిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయి. తాజా పెంపుతో చెన్నైలో సిలిండర్ ధర అత్యధికంగా రూ. 1,999.5కు, కోల్‌కతాలో రూ. 1,943కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ధర రూ.1833, ముంబైలో రూ.1785.5కి ఎగబాకింది. విమాన ఇంధనం(ఏటీఎఫ్) ధరలను ఈసారి రూ.5.79 శాతం తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశాయి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో మాత్రం కేంద్రం ఎలాంటి మార్పు చేయలేదు.
ఆవిరైన ఉపశమనం
వాణిజ్య గ్యాస్ సిలిండర్ విషయంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కలిపి కేంద్రం రూ. 257 తగ్గించింది. దీంతో అప్పటికే పెరిగిన ధరలతో కుదేలైన వారు కొంత ఉపశమనం లభించినట్టు భావించారు. అయితే, దీన్ని ఆవిరి చేస్తూ.. అక్టోబర్‌లో రూ. 209ని, తాజాగా రూ. 101.5ను కేంద్రం వడ్డించింది. అంటే మొత్తంగా రూ. 310.5 భారాన్ని మోపింది. దీంతో వాణిజ్య సిలిండర్‌ను వినియోగించే చిరు వ్యాపారులు, హోటళ్లు, రెస్టారెంట్లపై అదనపు భారం పడే అవకాశం ఉన్నది. తద్వారా సామాన్యులైన వినియోగదారులపై ఈ ప్రభావం పరోక్షంగా పడినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మే 26, 2014న వాణిజ్య సిలిండర్ ధర – రూ. 1,515
నవంబర్ 1, 2023న సిలిండర్ ధర – రూ. 1,999.5
తొమ్మిదిన్నరేండ్లలో పెంపు – రూ. 484.5 (32 శాతం)