సూర్యాపేట : తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా..లేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మంత్రి జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. జిల్లాలో బండి సంజయ్ పర్యటనలో అతడి వెంట వచ్చిన గుండాలతో రైతుల మీద పాశవికంగా జరిపిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు.
మహిళలు, గిరిజనులు, దళితులు అన్న తేడా తెలియకుండా యాసంగిలో తెలంగాణా ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా లేదా అని నిలదీసినందుకే బీజేపీ నేతలు ఇంతటి గుండాయిజానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
భూస్వామ్య దాడులను మరిపించే పద్ధతిలో బండి సంజయ్ వెంట వచ్చిన గుండాలు జరిపిన దాడులను తిప్పికొట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట చైతన్యాన్ని మరోమారు చాటిన మహిళా రైతాంగాన్ని ఆయన అభినందించారు.