MP Aravind | మెట్పల్లి, నవంబర్ 5: రేవంత్‌రెడ్డిని మించిన మోసగాడు రాజకీయాల్లో లేడని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను పూర్తిగా ముంచేస్తాడని కోరుట్ల బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. రేవంత్ కన్నా సీఎం కేసీఆర్ మంచివారని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆదివారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో అర్వింద్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మేడిగడ్డ బరాజ్ అన్ని పిల్లర్లు మునుగుతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావని చెప్పారు. బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాయని, హంగ్ వస్తే ప్రభుత్వాన్ని బీజేపీనే ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. మీడియా రాజకీయాలు చేస్తే తామూ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు.