తెలంగాణ చౌక్, ఫిబ్రవరి 15: నాయీబ్రాహ్మణ, రజక వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని తెలంగాణ నాయీ బ్రాహ్మణ సంఘం ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. మంగళవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షౌరశాలలు, ధోబీఘాట్లు, డ్రైక్లీనింగ్ షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన చట్టం తీసుకొచ్చి ఉచిత విద్యుత్తు అందించకుండా కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అభివృద్ధి చెందడం బీజేపీ నాయకులకు ఇష్టం లేదన్నారు. రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని నూతన విద్యుత్తు చట్టం మీద ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. దేశంలో ఉన్న 70 కోట్ల బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయడం లేదన్నారు. బీసీలకు న్యాయం చేయలేని ప్రధాని మోదీ ఐదు రాష్ర్టాల ఎన్నిక ప్రచారం ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేశంలో బీసీ వర్గాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, ప్రస్తుతం ఐదు రాష్ర్టాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఆశాభంగం తప్పదన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జంపాల నర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.