హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కాగానే బీజేపీ తన రొటీన్ డ్రామా మొదలుపెట్టింది. మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర బలగాలను దించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతిపత్రం ఇవ్వడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బీజేపీ నేతలను భయాందోళనలకు గురి చేస్తున్నారని, రక్షణ కల్పించాలని విన్నవించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీకి రాష్ట్రంలో ఆన్లైన్లో తప్ప క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదని ఆలస్యంగా గుర్తించిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కనీసం డిపాజిట్ అయినా దక్కించుకునేందుకు నానాతిప్పలు పడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా మొదలు అనేకమంది నేతలు మునుగోడులో తిరిగి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇన్నాళ్లు స్వేచ్ఛగా తిరిగిన ఆ పార్టీ నాయకులకు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంది ? ఎందుకు భయాందోళన చెందుతున్నారు ? అని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజల్లో సానుభూతి కోసమే కేంద్ర బలగాలు అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.