చండూర్: మునుగోడు నియోజకవర్గం చండూర్ మున్సిపాలిటీలోని 3వ వార్డుకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికీ ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అన్నారు. సుశిక్షితులైన పార్టీ శ్రేణులు, అత్యధిక సభ్యత్వంతో ఉన్న పార్టీ అని, దేశంలో టీఆర్ఎస్ లాంటి పార్టీ ఎక్కడా లేదని చెప్పారు. పార్టీలోకి వచ్చిన వారికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు.
మునుగోడు ఎన్నికలు కాంట్రాక్టర్ అయిన ఒక వ్యక్తి స్వార్థానికి, నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. స్వార్థాన్ని ఓడించాలని, ప్రజలు, ప్రజాస్వామ్యం గెలవాలని వ్యాఖ్యానించారు. మునుగోడులో కోమటిరెడ్డి సోదరులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.