చౌటుప్పల్ రూరల్/మర్రిగూడ, అక్టోబర్ 17: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు, ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మికి సోమవారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిరసన సెగలు తగిలాయి. వేర్వేరుగా ప్రచారానికి వెళ్లిన వీరిద్దరినీ ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు నిలదీశారు. ‘ముంపు బాధితులకు సొంతంగా రూ.10 లక్షలు ఇస్తా అన్నావ్.. గెలిచాక ఒక్కసారైనా మమ్మల్ని కలిశావా? ఇప్పుడెందుకు వచ్చావ్?’ అంటూ మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామస్థులు రాజగోపాల్‌రెడ్డిని నిలదీశారు. నమ్మి గెలిపిస్తే బీజేపీకి అమ్ముడుపోయారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించుకుని వెళ్లిపోయారు. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామానికి బీజేపీ నేత డీకే అరుణతో కలిసి ప్రచారానికి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మికి సైతం చేదు అనుభవం ఎదురైంది. ‘లక్ష్మి గో బ్యాక్’, ‘కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన వ్యక్తులు గ్రామానికి రావద్దు’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ముత్యాలమ్మ గుడికి రూ.5 లక్షలు ఇచ్చామని లక్ష్మి చెప్పుకోగా.. దళితులు ఒక్కసారిగా అడ్డుతగిలారు. ఆ డబ్బు ఎప్పుడు ఇచ్చారని నిలదీశారు. రాజగోపాల్‌రెడ్డి ఇప్పటివరకూ గ్రామానికి రాలేదని మండిపడ్డారు. మరోవైపు రైతుబంధు, రైతుబీమా, దళితబంధుతోపాటు పలు సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంట్లకెళ్లి ఇస్తుందా? అని డీకే అరుణ వ్యాఖ్యానించడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు తిరగబడ్డారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పి పంపించారు.
గుడికి 5 లక్షలు ఏవి?
రాజగోపాల్‌రెడ్డి గెలువగానే మా ఊరి గుడికి 5 లక్ష లు ఇస్తానన్నడు. నయాపైసా ఇవ్వలేదు. ఇవాళ ఆయ న తరఫున వచ్చిన వాళ్లు డబ్బులు ఇచ్చామని చెప్తుండ్రు. రాజగోపాల్‌రెడ్డి మా ఊరి ముఖం మళ్లెన్నడూ చూడలేదు.
– బక్క యాదయ్య, చిన్నకొండూర్