గోదావరిఖని/కోల్‌సిటీ/ఫర్టిలైజర్ సిటీ, ఫిబ్రవరి 2: మున్సిపల్ ఎన్నికల వేళ పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీజేపీ మహిళా అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు కిడ్నాప్ చేసి నామినేషన్ విత్‌డ్రా చేయించిన ఘటన కలక లం రేపుతున్నది. బాధితురాలి కథనం ప్రకా రం.. రామగుండం నగర పాలకసంస్థ ఒకటో డివిజన్ అభ్యర్థిగా బీజేపీ నుంచి రీమా బిశ్వాస్ నామినేషన్ వేశారు. ఆ డివిజన్లో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి మడిపెల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సోమవారం సో షల్ మీడియాలో ప్రచారం జరగ్గా.. ఆ కొద్దిసేపటికే తనను కిడ్నాప్ చేసి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా బెదిరించారంటూ బీజేపీ అభ్యర్థి రీమా బిశ్వాస్ రామగుండంలో జిల్లా అదనపు ఎన్నికల అధికారి అరుణశ్రీ, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదుచేశారు. ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసే తన భర్త పంకజ్ కుమార్‌ను ఎన్టీపీసీ పోలీసులు కాంట్రాక్టర్ ద్వారా పిలిపించుకొని భయభ్రాంతులకు గురిచేశారని బీజేపీ అభ్యర్థి రీమా బిశ్వాస్ వాపోయారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకోకపోతే ‘నీపై గం జాయి కేసు పెడుతామని, జైలుకు వెళ్తావా?’ అంటూ బెదిరించినట్టు పేర్కొన్నారు. మడిపెల్లి విజయ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఆమె భర్త మల్లేశ్, అతని అనుచరులు, పోలీసులతో తనను బెదిరించి బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి తన స్టేట్మెంట్ వీడియో రికార్డు చేసుకొని రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.