పచ్చటి తెలంగాణపై విచ్చుకత్తుల షడ్యంత్రం
8 ఏండ్ల పసి రాష్ర్టాన్ని ఆగం చేసే కుతంత్రం. ఢిల్లీ పెద్దల అహంకారం మళ్లీ బుసలు కొట్టింది. మరో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పడగవిప్పింది.
ఇతర పార్టీల సర్కార్లను కూలదోసే బీజేపీ గద్దల పాపపు చూపు ఇప్పుడు తెలంగాణపై పడింది. తెలంగాణలోనూ ‘షిండే’లను తయారు చేస్తామన్న బీజేపీ నేతలు అడ్డగోలు పనికి దిగారు. ‘కోట్ల కట్టల’తో ‘క్యాషాయ’ స్వాములు హైదరాబాద్‌కు వేంచేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి నిస్సిగ్గుగా బేరసారాలు జరిపారు.
అయితే మౌనంగా మోసపోవడానికి ఇది మహారాష్ట్ర కాదు; రణ తెలంగాణ. ఉద్యమ తెలంగాణ! ‘అనైతిక విలువల’ బీజేపీ ఆ సంగతి గ్రహించలేక అడ్డంగా బుక్కైంది. టీఆర్ఎస్ దంచి కొట్టింది. పన్నాగం ఎదురు తన్నింది.
నోటాధిపతులుగా మారిన పీఠాధిపతులు..
బీజేపీ బ్రోకర్లు… ఫామ్‌హౌస్‌లో అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. 2015లో ఒకసారి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర. 2022లో మరోసారి! అప్పుడు ఓటుకు నోటు కేసులో కెమెరాల సాక్షిగా రేవంత్‌రెడ్డి- చంద్రబాబు బండారం బట్టబయలు. ఇప్పుడు పోలీసు కెమెరాల సాక్షిగా మోదీ-షా పార్టీ గుట్టురట్టు. బీఆర్ఎస్ను స్థాపించి, జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న కేసీఆర్ తమ పుట్టి ముంచుతారన్నది మోదీ-షా భయం.
ఆయనను ఆపే చిల్లర ప్రయత్నం.. మునుగోడుకు ఉప సమరం. అక్కడ దారుణ పరాభవం తప్పదనే వాస్తవికత పర్యవసానం.. ఎమ్మెల్యేలను కొనే దుష్ట పన్నాగం. కేసీఆర్‌ను నేరుగా ఢీకొట్టే దమ్ములేక, రేపటి సూర్యుడు బీఆర్ఎస్ను సూటిగా ఎదుర్కొనలేక.. నక్కజిత్తుల వ్యవహారం! తప్పు చేసింది బీజేపీ. నిప్పులాంటి తెలంగాణతో చెలగాటమాడి బీజేపీ పెద్ద తప్పు చేసింది. ఈ తప్పు వెనక ఏముంది? ఎవరున్నారు?
ఇదొక భారీ కుట్ర..
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర!
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దించే కుట్ర!
మెడలో రుద్రాక్షలు.. మదిలో విష కక్షలు
వీరు బీజేపీ పెద్దలా.. లేక ఢిల్లీ గద్దలా?
ఇదా రాజకీయం.. ఇదా ప్రజాస్వామ్యం!
ఇవేనా వీరు రోజూ ఒర్రే నైతిక విలువలు!
ఇవేనా మీరు వల్లించే ధర్మ పన్నాలు!
గుజరాతీ షావుకార్లు కొనిపారేయడానికి, ఢిల్లీ గద్దలు తన్నుకుపోవడానికి, తెలంగాణ బిడ్డలు గంప కింద కమ్మే కోడి పిల్లలు కాదు. ధన మదమెక్కిన మత్త గజాలను చిత్తు చేయగల కొదమ సింహాలు. కేసీఆర్ సాదాసీదా రాజకీయ నాయకుడు కాదు; రాజకీయ కత్తుల కోలాటంలో కుత్తుకలు ఉత్తరించగల యోధుడు.
ఆది నుంచీ తెలంగాణపై వివక్షే!
తల్లిని చంపి బిడ్డను బ్రతికించారు. – 2014 ఏప్రిల్ 22న బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీ
ఎన్నికల్లో లబ్ధికోసం పార్లమెంటు తలుపులు మూసి అడ్డంగా విభజించారు. అప్పుడు సభ ఆర్డర్లో లేదు.
ఆంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా తెలంగాణను ఏర్పాటుచేసిన పక్షాల్లో మేమూ ఉన్నాం
– 2018 ఫిబ్రవరిలో ప్రధానిగా లోక్‌సభలో మోదీ
షిండేలను సృష్టిస్తామన్న బీజేపీ
టీఆర్ఎస్లో చాలామంది షిండేలున్నారు. మహారాష్ట్రలో జరిగినట్లుగా ఇక్కడ కూడా జరుగుతుంది.
– 2022 జూలై 11న బండి సంజయ్
మహారాష్ట్రలో మాదిరిగా తెలంగాణలోనూ రాజకీయం మారబోతున్నది. ఇక్కడ కూడా అనేక మంది షిండేలున్నారు.
– 2022 జూలై 1న లక్ష్మణ్
రెండు మూడు రోజుల్లో ఏక్నాథ్ షిండేల పేర్లు బయటపెడుతాం. వాళ్ల ఫోన్ల నుంచి మాట్లాడటం లేదు. వేరే నంబర్ల నుంచి మాట్లాడుతున్నారు.
– అక్టోబర్ 22 న రఘునందన్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): కోట్ల రూపాయల నగదు, కాంట్రాక్టులు, పదవుల ఆశ చూపి టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని బీజేపీ చేసిన కుట్రలను తెలంగాణ పోలీసులు ఛేదించారు. నగర శివారులోని మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిని పార్టీ ఫిరాయించాలని ఒత్తిడి చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు తెలియజేశారు.
ముగ్గురు వ్యక్తులు వచ్చి తమను ప్రలోభ పెడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాచారమిచ్చారని స్టీఫెన్ పేర్కొన్నారు. దీంతో ఫామ్‌హౌస్‌పై దాడి చేసి.. ఢిల్లీలోని ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజులు అనే ఇద్దరు స్వాములతోపాటు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిని వారు సంప్రదించారు. డబ్బు, కాంట్రాక్టులు, పదవులిస్తామని ప్రలోభాలకు గురిచేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నాం. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? స్వామీజీల వెనుక ఎవరున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నాం’ అని చెప్పారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సీపీ వివరించారు. నందకుమార్, సింహయాజి, రామచంద్ర భారతిలను పోలీసులు ఫాంహౌస్‌లోనే ప్రశ్నించారు. అనంతరం సింహయాజి, నందకుమార్‌లను అక్కడి నుంచి విచారణ నిమిత్తం తరలించారు. రామచంద్రభారతి ఇంకా ఫాంహౌస్‌లోనే ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
ఘటనా స్థలి నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు
బీజేపీ కుట్రలను బయటపెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్‌రాజు, కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి గర్వంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్వాములకు, ఎమ్మెల్యేలకు మధ్య రాయబారం నిర్వహించిన నందకుమార్.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు. స్వాములను రంగంలోకి దింపడం వల్ల ఎవరికీ అనుమానం రాదని భావించారని, స్వామీజీలు ప్రయాణించే కారులో డబ్బు తరలిస్తే, ఎవరూ ఆ వాహనాలను ఆపరనే ధీమాతో భారీ డబ్బు సంచులను కారులో వేసి స్వామిజీలతో ఫామ్ హౌస్‌కు తరలించారని సమాచారం.
బుధవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు నెరిపేందుకు వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడిన స్వాములు రామచంద్రభారతి, సింహయాజి, వ్యాపారి నందకుమార్.
పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు సంచులు
రామచంద్ర భారతి స్వామి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో కపిలాశ్రమం చీఫ్. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు అత్యంత సన్నిహితుడు.
సింహయాజి స్వామి
తిరుపతిలోని శ్రీమంత్రరాజ పీఠం నిర్వాహకులు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో, ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు.
నందకుమార్
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో కీలక సూత్రధారి. హైదరాబాద్ వ్యాపారి. బీజేపీ కేంద్రమంత్రులతో సన్నిహిత సంబంధాలు.
బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో నందకుమార్ (ఫైల్ ఫొటో)
నకిలీ పేరుతో వచ్చిన ఢిల్లీ స్వామి
రామచంద్రభారతి స్వామి, సింహయాజి స్వామితో తమకు సంబంధం లేదని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చెప్పడాన్ని పోలీసు వర్గాలు కూడా తప్పుబడుతున్నాయి. ‘ఆ ఫామ్‌హౌస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వామీజీ దగ్గరకు పోయారా? స్వామీజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్ దగ్గరికి వచ్చారా? ఆయన దొరికింది టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లోనే కదా… ఇంక చెప్పడానికి ఏముంది?’ అని ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రశ్నించారు. స్వామీజీ దగ్గర కోట్లకొద్దీ డబ్బులు ఎందుకున్నాయని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న మరో అధికారి ఇంకో కీలక విషయాన్ని వెల్లడించారు. ‘ఢిల్లీ నుంచి వచ్చిన స్వామీజీ పేరు రామచంద్రభారతి. కానీ ఆయన నకిలీ పేరుతో విమానంలో ప్రయాణించారు. ఆయన టికెట్ సతీశ్‌శర్మ అనే పేరుతో బుక్ అయి ఉంది. దాల్ మే కుఛ్ కాలా హై. ఆయన స్వచ్ఛమే అయితే, ఏ తప్పూ చేయకపోతే నకిలీ పేరుతో ప్రయాణం చేయాల్సిన అవసరం ఏముంది’ అని ఆయన ప్రశ్నించారు.