హైదరాబాద్, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ నేతలు చీకటి ఒప్పందాలు కుదుర్చుకొన్నారని, ఇందుకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఉద్యమకారులంతా తిరిగి టీఆర్ఎస్లో చేరుతున్నారని, మునుగోడులో బీజేపీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీలో వారు విలేకరులతో మాట్లాడారు. మునుగోడులో బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నారని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
రాచకొండ ప్రాంతానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించే దమ్మున్నదా అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అహంకారంగా వ్యవహరిస్తున్నారని, సీఎం కేసీఆర్ గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా మూడేండ్లలో మునుగోడు నియోజకవర్గానికి ఆయన ఏం చేశారని, ఏనాడైనా నియోజకవర్గంలో నిద్ర చేశారా? అని ప్రశ్నించారు. గుర్తులు, ఈడీల మీద ఆధారపడుతూ బీజేపీ రాజకీయం చేస్తున్నదని ధ్వజమెత్తారు.