హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేరుతో హడావుడి చేస్తున్న ప్రభుత్వానికి సలకం చెరువులో ఉన్న ఒవైసీ భూములను కూల్చే దమ్ముందా? అని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కబ్జాలను కప్పిపుచ్చుకోవడానికి ఒవైసీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. నిజంగా ప్రజాప్రతినిధివే అయి తే స్వచ్ఛందంగా కట్టడాలను కూల్చేయాలని డిమాండ్ చేశారు. సలకం చెరువులోని ఆక్రమణలు హైడ్రా కమిషనర్‌కు కనిపించకుంటే తానే వచ్చి చూపిస్తానని చెప్పారు. హామీలను నెరవేర్చలేకనే ప్రభుత్వం హైడ్రాను తెర మీద కి తెచ్చిందని విమర్శించారు. దమ్ముంటే పాతబస్తీలో గుర్రం చెరువు, జల్పల్లి చెరువులోనూ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటన్నింటినీ కూల్చేయాలని డి మాండ్ చేశారు. రాష్ట్రంలో అన్యాక్రాం తం అయిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. దేవాదాయ శాఖ భూముల్లోని ఆక్రమణలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.