Employees JAC | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): జీవో-317పై క్యాబినెట్ సబ్ కమిటీ అందజేసిన నివేదికను సీఎస్ ఇస్తారని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పడంతో శుక్రవారం సచివాలయానికి వెళ్లిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు నిరాశే మిగిలింది. మధ్యహ్నం 12 గంటల ప్రాంతంలో రెండు జేఏసీల నేతలు సీఎస్‌ను కలిశారు. అయితే, ఆ నివేదికను ఇవ్వలేమని, సర్క్యులేషన్లో ఉన్నదని సీఎస్ తేల్చిచెప్పడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఖంగుతిన్నారు. ఒకేరోజు వ్యవధిలో సీఎం ఒకలా, సీఎస్ మరోలా చెప్పడంతో ఉద్యోగ సంఘాల నేతలకు ఏమి చేయాలో పాలుపోలేదు. చేసేదేమీలేక సీఎస్‌కు వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు.
‘క్యాబినెట్ సబ్ కమిటీ జీవో-317పై నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించింది. ఇంతవరకు దానిని ఓపెన్ చేయలేదు. నేను కూడా చూడలేదు. ఆ నివేదిక సీఎస్ దగ్గర ఉన్నది. శుక్రవారం సీఎస్‌ను కలవండి. మీకు తలా ఒక నివేదిక ఇస్తారు. అధ్యయనం చేసి, మార్పులు చేర్పులుంటే సూచించండి. క్యాబినెట్లో చర్చించి పరిష్కరిస్తాం’
– గురువారం ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి
జీవో-317పై క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఫైల్ సర్క్యులేషన్లో ఉన్నది. ఇప్పడైతే ఇవ్వడం కుదరదు. ప్రభుత్వం ఆ నివేదికను ఆమోదించిన తర్వాత బహిర్గతం చేస్తాం. మీరు ఏదైనా చెప్పేదుంటే చెప్పండి. మీ వినతుల్విండి.
– శుక్రవారం ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సీఎస్ శాంతికుమారి
జీవో-317తో ఉద్యోగులు స్థానికతను కోల్పోయారు. మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఉద్యోగులు ఈ జీవోతో నష్టపోయారు. పాత 6వ జోన్‌లోని కొన్ని జిల్లాలను మల్టీజోన్-1కు కేటాయించారు. దీంతో ఉద్యోగుల కేటాయింపులో అన్యాయం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఒకే ప్రాంతం లో సర్దుబాటు చేయాలి. స్పౌజ్, పరస్పర, హెల్త్గ్రౌండ్స్లో న్యాయం చేసేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసులు చేసినట్టు తెలుస్తున్నది. జీవోతో సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులందరికీ న్యాయం చేయాలి. ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకుండా చూడాలి.
-వీ లచ్చిరెడ్డి, ఉద్యోగ సంఘాల జేఏసీ నేత
జీవో-317 ద్వారా నష్టపోయిన ఉద్యోగుల ప్రతి దరఖాస్తును పరిశీలించి న్యాయంచేయాలి. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి సర్దుబాటు చేయాలి. ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా క్యాడర్ విభజన చేపట్టారు. దీంతో గందరగోళానికి దారితీసింది. క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్టును బహిర్గం చేయాలి. ఉద్యోగులకు వ్యతిరేకమైన అంశాలను సవరించాలి. 5, 6 జోన్లను మల్టీజోన్లుగా చేయాలి. గెజిటెడ్ పోస్టులను పెంచాలి. రెండు మూడు నెలలకొకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటుచేయాలి.
-మారం జగదీశ్వర్, ఉద్యోగ సంఘాల జేఏసీ నేత