పల్లెకు పుట్టినరోజు..పరవశంలో గ్రామస్తులు

మెదక్ : మనం ఎప్పుడైనా ఎక్కడైనా మనుషుల పుట్టినరోజులు జరుపుకోవడం చూసినం. కొంతమంది తమ పెంపుడు జంతువుల పుట్టిన రోజులు కూడా జరపడం చూసినం. కానీ, తమ సొంతూరుకు పుట్టిన రోజు చేసుడు ఎక్కడ చూడలేదు కదా.. పదండి మరి ఆ అరుదైన అపురూప వేడుకకు నెలవైన ఊరి గురించి తెలుసుకుందాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ అనే ఊరికి ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు పుట్టిన రోజు జరుపుతున్నరు. ఆ వివరాలు తెలుసుకొని మనం కూడా హ్యాపీ బర్త్‌డే చెబుదామా మరి.
1200 మంది జనాభా ఉన్న లక్ష్మీనగర్ 1995లో గ్రామ పంచాయతీ అయింది. ‘‘ఊరు మంచిగుంటేనే.. మనమందరం మంచిగుంటం. మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకోవాలె’’ అనే ఉద్దేశంతో పెండ్యాల ప్రసాద్ అనేటాయన 2014ల ‘లక్ష్మీనగర్ వెల్ఫేర్ సొసైటీ’ని ఏర్పాటు చేసిండు. ‘ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు ఊరికి పుట్టిన రోజు చేద్దాం’ అనే కాన్సెప్ట్‌తో ఊళ్లో వాళ్లందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఆరేండ్లుగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నవాళ్లు ఊరి అభివృద్ధికి తమ వంతు సాయం చేసేలా ఈ పుట్టిన రోజున అవగాహన కల్పిస్తున్నరు.
ఊరికోసం ప్రత్యేకంగా వెబ్సైట్!
పుట్టిన ఊరుకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మొక్కలు నాటి, వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేసిన్రు. పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ వాడకుండా నిషేధించిన్రు. ఇలా ప్రతి పుట్టిన రోజుకు ఊరు కోసం ఓ కొత్త నిర్ణయం తీసుకుంటరు. అంతేకాదు ఈ ఊరు పేరు మీద ఒక వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసిన్రు. దీంట్లో ఊరి చరిత్ర నుంచి మొదలుపెట్టి.. ఊళ్లో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అప్డేట్ చేస్తున్నరు. ఒకసారి www.ourlaxminagar.org లో చూస్తే.. ‘మన ఊరిని కూడా ఇట్ల మార్చుకోవాలె’ అనే ఆలోచన రావడం ఖాయం.
కేక్ కట్ చేసి..
ఉన్న ఊరిని..కన్నతల్లిని మర్చిపోవద్దంటారు. దాన్ని గుర్తు చేసేలా సంక్రాంతి రోజు ఈ ఊరు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేస్తారు. ముగ్గులు, పతంగుల పోటీలు పెడతారు. ఊళ్లో వాళ్లంతా ఒకదగ్గరికి చేరి.. సంతోషంగా చప్పట్లు కొడుతూ కేక్ కట్ చేస్తారు. ఆ తర్వాత గడిచిన సంవత్సరం చేసిన పనుల్ని రివ్యూ చేసుకుంటరు. ఈ ఏడాది పూర్తి చేయాల్సిన పనులేంటో ప్లాన్ చేస్తరు. వాటిని ఎట్ల చేయాలో చర్చించుకుంటరు. మొత్తంమీద ‘మన ఊరిని.. మనమే కాపాడుకోవాలె’ అనే కాన్సెప్ట్‌తో మిగతా పల్లెలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తున్న లక్ష్మీనగర్‌కు హ్యాపీ బర్త్ డే అని చెప్పాలి. గురువారం లక్ష్మీ నగర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా స్థానిక సర్పంచ్ అనురాధ ఏడుకొండలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చావా బాపారావు, రామాంజనేయులు తదితరులు పాల్గొని వివిధ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు.
ఇవి కూడా చదవండి..
‘అక్షరయాన్’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
టీకా ఎవరు తీసుకోవాలి.. ఎవరు తీసుకోవద్దు ?
తాజావార్తలు
- ఒకే స్కూళ్లో 229 మంది విద్యార్థులకు కరోనా
- ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య.. కేరళలో బంద్
- నగ్నంగా ఉన్న ఫొటో అడిగిన నెటిజన్.. షేర్ చేసిన శ్రీముఖి
- మణిపూర్‌లో స్వల్ప భూకంపం
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్‌లో బన్నీ ఫ్యామిలీ హల్చల్