హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ ఉద్యోగులు, అధికారులంతా ఇకపై రోజూ తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని సీఎండీ ఎన్ బలరాం ఆదేశించారు. విధులకు రాకుండా మస్టర్ పడిన వారిపై వేటువేస్తామని, విధులకు హాజరైన తర్వాత బయటికెళ్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిఘా వర్గాల ద్వారా తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, మధ్యాహ్న భోజనం తర్వాత చాలా మంది మూడు గంటల వరకు విరామం తీసుకుంటున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. బయోమెట్రిక్ హాజరుపై ఏరియాల వారీగా జీఎంలు, విభాగాధిపతులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగరేణి దవాఖానలు, డిస్పెన్సరీల్లోని వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులుకు హాజరుకాకపోతే కఠిన చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు. బొగ్గు ఉత్పత్తిలో పాల్గొంటున్న కార్మికులు రోజుకు 8 గంటలు పనిచేస్తున్నారని, ఉద్యోగులు, అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని హితవు పలికారు. కొత్తగూడెంలోని కార్పొరేట్ కార్యాలయంలో 32 మంది ఆలస్యంగా వచ్చారని, వారిని ఆయా విభాగాధిపతులు మందలించారని తెలిపారు. నిరంతరంగా సమయపాలను నమోదు చేయాలని, జీఎంలు కార్యాలయాలు, గనుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని సీఎండీ ఆదేశించారు.