హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): మెడికల్ కాలేజీల నిర్వహణపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్), హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్ఎంఎస్)ను అమలు చేయాలని నిర్ణయించింది.
ప్రతి కాలేజీలో కచ్చితంగా 25 సీసీ కెమెరాలు బిగించాలని ఇప్పటికే ఆదేశించింది. ఈ మూడు వ్యవస్థలను ఢిల్లీలోని ఎన్ఎంసీలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని స్పష్టంచేసింది. ఏఈబీఏఎస్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల హాజరును పర్యవేక్షించవచ్చని తెలిపింది. హెచ్ఎంఎస్ ద్వారా కాలేజీల అనుబంధ దవాఖానలకు వచ్చే రోగుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే అవకాశం కలుగుతున్నదని ఎన్ఎంసీ పేర్కొన్నది. ఈ ప్రక్రియను ఈ నెలలోనే పూర్తి చేయాలని కోరింది. ఇదిలావుండగా, ఎండీ ఫార్మాకాలేజీ, జనరల్ మెడిసిన్‌కు నూతన సిలబస్‌ను ప్రకటించింది. పీజీ సీట్ల అడ్మిషన్ల వివరాలను వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అన్ని మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ ఆదేశించింది.