నంగునూరు, ఏప్రిల్ 11: పర్యావరణ పరిరక్షణతోపాటు ఇంధన స్వయం సమృద్ధి దిశగా సిద్దిపేట జిల్లా మరో కీలక అడుగు వేస్తున్నది. ఈ పరిశ్రమ నంగునూరు మండలం నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ సమీపంలో రూ.250 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్నది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల వంట గ్యాస్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ ఇంధన వనరులను ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వం ‘గోబర్ దాన్’ పథకంలో భాగంగా ఈ ప్లాంటు నిర్మిస్తున్నది. అభివృద్ధి చెందుతున్న బయో ఎనర్జీ రంగంలో అగ్రగామిగా ఉన్న జూనో జౌల్ బయో ఫ్యూయల్స్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టింది.
సాధారణంగా వరి కోతల తర్వాత రైతులు గడ్డి, పొట్టును పొలాల్లోనే తగులబెడుతుంటారు. దీనివల్ల వెలువడే వాయువులతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూమి సారం కూడా తగ్గుతున్నది. వరి పొట్టు, పంట వ్యర్థాలు, పశువుల పేడ, పౌల్ట్రీ వ్యర్థాలను ఈ ప్లాంటులో ఇంధన తయారీకి వాడుతారు. సేంద్రియ వ్యర్థాలతో స్వచ్ఛమైన ఇంధనంగా మార్చడం ద్వారా కాలుష్యం తగ్గడమేకాకుండా, వరి వ్యర్థాల ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉన్నది.
రాష్ట్రంలోనే తొలిసారిగా క్లస్టర్ పద్ధతిలో 10 ప్లాంట్లను ఇకడ నిర్మిస్తున్నారు. ఒకో ప్లాంటు రోజుకు 10 టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే మొత్తం క్లస్టర్ ద్వారా రోజుకు 100 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. టీజీఐఐసీ సేకరించిన 20 ఎకరా ల స్థలంలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం కాగా,బయోగ్యాస్ ప్లాంటు కూడా రావడంతో స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్ఠాత్మక కంప్రెస్డ్ బయో-గ్యాస్ (సీబీజీ) ప్లాంటుకు ఆదివారం భూమిపూజ చేయనున్నారు. క్లస్టర్ పద్ధతిలో 10 ప్లాంట్లతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు 2030 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నది. ‘గోబర్ దాన్’ పథకం కింద నిర్మిస్తున్న ఈ ప్లాంటు భూమిపూజకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు, మెదక్ ఎంపీ రఘునందన్, రాజ్యసభ సభ్యుడు భువనేశ్వర్ హాజరుకానున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 400 మందికి ఉపాధి లభించనున్నది.