హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రెండవ జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ బీసీలందరికీ మార్గదర్శకుడని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. బీపీ మండల్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని వివరించారు. తెలంగాణలో బీసీ గురుకులాల సంఖ్యను 310కి పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నాణ్యమైన విద్యతో పాటు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నదని తెలిపారు. బుధవారం బీపీ మండల్ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను మంత్రి స్మరించుకొన్నారు. ఘనంగా నివాళి అర్పించారు. బీహార్‌లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నెలకొల్పిన బీపీ మండల్.. సమాజంలో బీసీలు ఎదురొంటున్న వివక్షను ప్రశ్నించి ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం వదులుకొన్నారని కీర్తించారు. 1980లో బీపీ మండల్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగానే ఓబీసీలకు 27% రిజర్వేషన్లు లభించాయని గుర్తుచేశారు. మండల్ కమిషన్ చేసిన అనేక ముఖ్య సిఫారసులను ఇప్పటికీ కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. మండల్ ముఖ్య సిఫారసుల్లో జనగణనలో బీసీ కులాల గణన కూడా ఒకటని పేర్కొన్నారు. బీసీని ప్రధానిని చేశామని చెప్పుకొంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులగణన చేపట్టడం లేదని దుయ్యబట్టారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.