హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ)కి రాష్ట్ర ప్రభుత్వం రూ.503 కోట్లను విడుదల చేయగా బిల్లుల క్లియరెన్స్ మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంలో ఓ కీలకాధికారి చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. వెబ్సైట్లో బిల్లుల అప్‌లోడ్‌కు 2 శాతం, క్లియరెన్స్‌కు 2 శాతం కలిపి మొత్తం 4 శాతం డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఉన్నతాధికారులకు ఇచ్చుకునే కమీషన్‌ను 6 శాతంగా ఫిక్స్ చేసినట్టు ఆరోపణలున్నాయి. బిల్లు పాస్ కావాలన్నా.. చెక్ చేతికి అందాలన్నా.. తనను ప్రసన్నం చేసుకోవాలని సదరు అధికారి రూల్ పెట్టినట్టు జోరుగా చర్చ నడుస్తున్నది. బిల్లులు క్లియర్ చేయాలంటే పర్సంటేజీ చెల్లించాల్సిందేనని సదరు అధికారి పట్టుబడుతున్నట్టు మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులు చెప్తున్నారు. గతంలో ఇదే అధికారి ప్రధాన మంత్రి అయూష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన మిషన్ (పీఎం-అభిమ్)కు సంబంధించి రూ.27 కోట్ల చెల్లింపులోనూ భారీగా కమీషన్ తీసుకున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.