హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల వేతనాలు, బిల్లులు చెల్లించేందుకు వినియోగిస్తున్న ఈ కుబేర్ను రద్దుచేయాలని, ట్రెజరీ ద్వారానే పాత విధానంలో ఉద్యోగుల బిల్లులను చెల్లించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. 2022 జూలై 1 నుంచి పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరింది. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అధ్యక్షతన బుధవారం నాంపల్లి టీఎన్జీవో భవన్లో నిర్వహించారు. 51 శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని ప్రకటించాలని, ఈహెచ్ఎస్ అమలుచేయాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేయాలని, సీపీఎస్, యూపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను పునరుద్ధరించాలని, గ్రంథాలయాలు, మార్కెట్ కమిటీలు, ఎయిడెడ్, వైద్యవిధాన పరిషత్, మోడల్ స్కూళ్లు, గురుకులాల ఉద్యోగులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, ఏపీలో మిగిలిపోయిన 50 మందితోపాటు 9, 10వ షెడ్యూల్లోని ఉద్యోగులను తెలంగాణకు తిరిగి తీసుకురావాలని తీర్మానం చేసింది. సమావేశంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ, అసోసియేట్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, కోశాధికారి శ్రీనివాసరావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.