హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పట్టణ, స్థానిక సంస్థల్లో(యూఎల్బీలు) మున్సిపల్ పన్నులను మరింత సులభంగా చెల్లించేందుకు వీలుగా తీసుకొచ్చిన ‘బిల్ వన్’ సేవలను మున్సిపల్ పరిపాలనశాఖ కార్యదర్శి, సీడీఎంఏ డాక్టర్ కేటీ శ్రీదేవి శుక్రవారం ప్రారంభించారు. ఈ ‘బిల్ వన్’ విధానం ద్వారా ఆస్తిపన్ను, నీటి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను విడివిడిగా కాకుండా ఒకే వేదిక ద్వారా ఒకేసారి చెల్లించవచ్చని ఆమె చెప్పారు. ఒకే పీటీఐఎన్ నంబర్‌పై ఉన్ని అన్ని మున్సిపల్ బకాయిలను కలిపి ఒకే ఏకీకృత డిమాండ్ నోటీసుగా ఈ వ్యవస్థ రూపొందిస్తుందని, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎకువ ఆస్తులు ఉన్నా వాటన్నింటికి విడివిడి నోటీసులు ఇవ్వకుండా ఒకే బిల్లులో చూపిస్తారని చెప్పారు. పన్ను బకాయిలను పాక్షికంగా, విడతలవారీగా చెల్లించే పద్ధతిని కూడా ఇందులో ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. ఈ సేవలు మున్సిపల్ వార్డు అధికారులు, బిల్ కలెక్టర్ల వద్ద ఉండే హ్యాండ్ హెల్డ్ డివైజెస్ ద్వారా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పౌరులు నేరుగా అధికారిక మున్సిపల్ వెబ్ సైట్ https://emunicipal.telangana.gov.in/ ద్వారా కూడా ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చని వివరించారు.